iDreamPost
iDreamPost
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. కానీ దానిని వాయిదా వేస్తూ వచ్చారు. అప్పట్లో రాజకీయ కారణాలతో సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక పోరుని ఎదుర్కోవడం ఇష్టం లేక ప్రభుత్వం వాయిదా వేసినట్టు కనిపించింది. కానీ చివరకు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ప్రయత్నాలకు కూడా బ్రేకులు వేసే దిశలో టీడీపీ ఆలోచిస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల ఫలితాలలో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం వెంటనే స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల అంశంలో టీడీపీ నాయకుడి పిటీషన్ తో బీసీలకు జగన్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల అమలుకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్న టీడీపీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించే లక్ష్యంతో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.
రాజకీయంగా చూస్తే ఏపీలో విపక్షాలు వెనుకబడి ఉన్నాయి. ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని గ్రహించాయి. అందుకు అనుగుణంగానే ప్రధాన ప్రతిపక్షం స్థానిక సమరానికి సన్నాహాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమరావతి కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత, దానికి తోడు క్యాడర్ లో మొన్నటి ఎన్నికల నాటి పరాజయం తాలూకా నైరాశ్యం వైదొలగకపోవడం, జగన్ ప్రభుత్వం వరుస సంక్షేమ కార్యక్రమాలతో సామాన్యులకు చేరువ కావడం వంటి కారణాలతో విపక్ష టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండే లోకల్ ఎన్నికల్లో దూకితే ఉన్న పరువు కూడా పోతుందని భయపడుతుంది. మరోసారి ఘోర పరాజయం ఎదురయితే పార్టీకి పునాదుల్లోనే బీటలు వారుతున్న సంకేతాలు మరింత బలపడతాయి. ఇలాంటి ప్రమాదాన్ని ఇప్పటికే చంద్రబాబు గ్రహించారు.
దానికి అనుగుణంగానే జనవరిలో లోకల్ బాడీల ఎన్నికలకు ప్రకటించిన రిజర్వేషన్లకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉలిక్కిపడ్డ టీడీపీ వెంటనే అప్రమత్తమయ్యింది. దాంతో సుప్రీంకోర్ట్ సహాయంతో సమీక్ష చేసిన తీర్పులో ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించారు. ఆ క్రమంలో రెండు నెలల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరుకి ఎన్నికలు పూర్తి చేయాలనే సంకల్పంతో సాగుతున్నట్టు కనిపించడంతో టీడీపీలో కలవరపాటుకి గురిచేస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు తమకు తలకు మించిన భారం అని టీడీపీ అంచనా వేస్తోంది. దాంతో మరోసారి కోర్ట్ తలుపులు తట్టడం ద్వారా ఎన్నికలను వాయిదా వేయించే లక్ష్యంతో కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం అవసరం అయితే బడ్జెట్ వాయిదా వేసి ఎన్నికలకు సిద్ధపడుతుంటే, ప్రతిపక్షం మాత్రం కోర్ట్ కి వెళ్లయినా ఎన్నికలు జరగకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
దాంతో స్థానిక ఎన్నికల పోరు వ్యవహారం రసవత్తరంగా కనిపిస్తోంది. రాజకీయ కారణాలతో విపక్షాల్లో ప్రధానంగా తెలుగుదేశం వేస్తున్న ఎత్తులు స్థానిక సంస్థలకు పెద్ద చిక్కులు తెచ్చేలా ఉంది. ఇప్పటికే వాయిదాలపై వాయిదాలు వేస్తూ వస్తున్న ఈ వ్యవహారంలో ఇప్పటికయినా స్పష్టత రాకపోతే వేల కోట్ల నిధులు వెనక్కి పోయే ప్రమాదం ఉంది. దాంతో ప్రభుత్వం ఆఘమేఘాల మీద ముందుకు సాగాలని ఆశిస్తోంది. అందుకు అడ్డుపుల్ల వేయాలని విపక్షం భావిస్తోంది. చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.