తప్పు చేయలేదు కాబట్టే ముందస్తు బెయిల్ కి వెళ్ళలేదు.. మరి వాళ్లందరూ ఉమా ..?

కొంతమంది రాజకీయనేతల మాటలు విచిత్రంగా ఉంటుంటాయి. సందర్భానుసారంగా ఒకే విషయంపై వారు భిన్నంగా స్పందిస్తూ ఔరా అనిపించేలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా ఇదే విధంగా స్పందించారు. ఎన్జీవో మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ పి. అశోక్‌బాబు.. నకిలీ డిగ్రీతో పదోన్నతి పొందారనే కేసులో సీఐడీ అధికారులు ఆయన్ను గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. విచారణ జరుపుతున్నారు. అశోక్‌బాబు అరెస్ట్‌ అక్రమమంటూ ఈ రోజు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన దేవినేని ఉమా.. తప్పు చేయలేదు కాబట్టే అశోక్‌బాబు ముందస్తు బెయిల్‌ తీసుకోలేదని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్‌తో అశోక్‌బాబు సశ్చీలుడని ప్రజలందరూ భావించాలనేది దేవినేని ఉమా లక్ష్యం కాబోలు.

దేనినేని చెప్పింది నిజమే కావచ్చు. తప్పు చేయలేదు కాబట్టే అశోక్‌బాబు అరెస్ట్‌ అవుతానని భయపడలేదు. అందుకే ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు పోలేదని అనుకుందాం. మరి ముందస్తు బెయిల్‌ కోసం పోయిన వారందరూ తప్పు చేసినట్లేనని దేవినేని తన ప్రకటన ద్వారా చెప్పదలుచుకున్నారా..? అనే ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. ఇటీవల పలువురు టీడీపీ నేతలు వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ కూడా పొందారు.

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం 2020 సెప్టెంబర్‌ 7వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వహయాంలో పోలీస్‌ శాఖలో భద్రతాపరమైన పరికరాల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో అరెస్ట్‌ చేస్తారనే భయంతో ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2021 జనవరి 5వ తేదీన ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది.

చంద్రబాబు ప్రభుత్వహయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌ కోసం ఆ సంస్థ మాజీ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు ఓఎస్‌డీగా పని చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్‌ 13వ తేదీన లక్ష్మీ నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. 

ఫోర్జరీ అభియోగాలకు సంబంధించి నమోదైన కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2020 జూలై 17వ తేదీన తెలంగాణ హైకోర్టు రవి ప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

పితాని సురేష్, ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ, రవి ప్రకాశ్‌లు.. తప్పు చేశారు కాబట్టే ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులకు వెళ్లారని దేవినేని ప్రకటన రూఢీ చేస్తోంది. మరి వీరి విషయంలో నాడు కక్ష సాధింపు, అక్రమం అంటూ మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏమంటారు..?

Also Read : టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్ట్

Show comments