Idream media
Idream media
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి (కరువు), నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గారపాటి సాంబశివరావు (80) మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయడుగూడెం లోని తన స్వగృహంలో సాంబశివరావు తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్‌కు బంధువైన సాంబశివరావు దెందులూరు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఒక సారి మంత్రిగా పని చేశారు.
గారపాటి సాంబశివరావు కుటుంబం 1955 నుంచి రాజకీయాల్లో ఉంది. సాంబశివరావు పలుమార్లు దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సాంబశివరావు సోదరుడు డాక్టర్ గణేశ్వర రావు ఎన్టీ రామారావు కుమార్తె డాక్టర్ లోకేశ్వరిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ గణేశ్వర రావు కుటుంబం అమెరికాలో స్థిరపడింది.
Also Read : తెలంగాణ హైకోర్టు జడ్జిల నియామకం
టీడీపీ ఆవిర్భావం తర్వాత సాంబశివరావు ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్‌తో బంధుత్వం వల్ల సాంబశివరావుకు టీడీపీలో మంచి ప్రాధాన్యత లభించింది. 1983 నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 1983,1985, 1994, 1999 ఎన్నికల్లో దెందులూరులో గెలిచారు. 1989, 2004 ఎన్నికల్లో తండ్రికొడుకులైన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, మాగంటి బాబుల చేతిలో ఓడిపోయారు. ఎన్టీఆర్‌కు బంధువైనా.. 1995 ఆగష్టు సంక్షోభంలో చంద్రబాబు వైపున సాంబశివరావు నిలిచారు.
2004లో సాంబశివరావు ఓటమి తర్వాత యువకుడు, ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై కన్నేశారు. ఈ క్రమంలో సాంబశివరావుపై మాటల దాడి చేయించేవారు. అసత్యాలు ప్రచారం చేయడం, తన అనుచరులతో మాటల దాడి చేయించడం చేసేవారు. 65 ఏళ్ల వయస్సులో ఉన్న సాంబశివరావుకు జ్ఞాపక శక్తి తగ్గిందని, వినికిడి లోపం వచ్చిందని, కార్యకర్తలను కూడా గుర్తించడం లేదంటూ తన అనుచరుల చేత ప్రతి సభలో రభస చేయించేవారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేసే సాంబశివరావు ఆ దాడిని తట్టుకోలేకపోయేవారు.
Also Read : ఏపీ రాజధాని పై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే..తేల్చి చెప్పిన కేంద్రం
టిక్కెట్ తనకు ఇవ్వకుంటే.. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ చింతమనేని టీడీపీ అధినేత చంద్రబాబును బెదిరించేవారు. 2004 ఎన్నికల తర్వాత నాయకులు కాంగ్రెస్‌లోకి వలసవెళ్లడం, ఓ పక్క చింతమనేని బెదిరింపుల నేపథ్యంలో.. 2009లో సాంబశివరావుకు టిక్కెట్ దక్కలేదు. చింతమనేని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.రామచంద్ర రావుపై గెలిచారు. 2009 ఎన్నికల్లో టిక్కెట్ లభించకపోవడం.. వయస్సు కూడా పైబడడంతో సాంబశివరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎనిమిది పదుల వయస్సులో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఇకలేరు