విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని పూర్తిగా హరించి, కేంద్రం చేతిలోనే విద్యుత్ వ్యవస్థను పెట్టుకోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన విషయంలో వెనక్కు తగ్గింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలతో పాటు, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను పున: సమీక్షించడానికి అడుగులు వేస్తోంది.
ముందే వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు పోవడంతో పాటు విద్యుత్ బిల్లుల మీద విద్యుత్ సరఫరా మీద పూర్తిగా ఆధిపత్యం కేంద్రానికి వెళ్తుంది. ఈ ప్రతిపాదనను మొదట్లోనే జగన్ ప్రభుత్వం ఖండించింది. దీంతోపాటు అవసరం మేరకు విద్యుత్ సరఫరాను పొందే అవకాశం ఉండదు. ఈ ప్రతిపాదనలను సూచించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తీరును రాష్ట్ర ప్రభుత్వం ఖండించడం తో పాటు వెంటనే ఈ ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేసింది.
తాజాగా కీలకమైన విద్యుత్ ధరల నియంత్రణ అధికారాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా ధరలో నియంత్రించుకునే అధికారం రాష్ట్రానికి వదిలి పెట్టేలా ముసాయిదాలో మార్పులు తీసుకువచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొనసాగించేందుకు, దాని ద్వారానే డిమాండ్, సరఫరా, ధర నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్లు కలిగినట్లు అయింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం..
గత ఏడాది మొదట్లోనే విద్యుత్ సంస్కరణలు పై కేంద్రం కీలక అడుగులు వేస్తోందని, దానికి సంబంధించిన ముసాయిదాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. దీనిపై అభ్యంతరాలను తెలియజెప్పాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. సంస్కరణ ముసాయిదా అందుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై గట్టిగా స్పందించింది. రాష్ట్రం విచక్షణాధికారం గా విద్యుత్ సరఫరా, ధరలను ఇప్పటి వరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిని పూర్తిగా రద్దు చేసి కేంద్రం తన ఆధీనంలో జాతీయ గ్రిడ్ ద్వారా విద్యుత్ పంపిణీ కానీ కరణం కానీ నిర్వహించేలా ముసాయిదా తీసుకువచ్చారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ సరఫరా ధరలు నిర్ణయించే అధికారం ఉండాలని గట్టిగా వాదించింది.
సబ్సిడీ కేంద్రం భరించగలదా?
డిస్కంలు అందించే విద్యుత్ వినియోగదారులకు చేరడానికి ఒక యూనిట్‌కు ఆరు రూపాయల పైనే పడుతుంది. అయితే అంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తే ఎంతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ఇప్పటివరకూ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ధరలను నిర్ణయించి దానికి అనుగుణంగా ప్రభుత్వం యూనిట్ మీద సబ్సిడీ ఇస్తూ వస్తోంది. 2020 21 లో 1700 కోట్ల గృహ విద్యుత్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే రైతులకు 9 గంటల పగటిపూట విద్యుత్ దానికి ఏకంగా 9 వేల కోట్ల రూపాయల సబ్సిడీ డిస్కమ్‌లకు ప్రభుత్వం ఇస్తోంది. ప్రతి రాష్ట్రం కూడా అక్కడి పరిస్థితులను బట్టి విద్యుత్ విషయంలో తగు పథకాలను చేసింది. ఇప్పుడు కేంద్రం పూర్తిగా విద్యుత్ మీద నియంత్రణ తీసుకుంటే అది పూర్తిగా వినియోగదారుడికి భారం అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.
వెనక్కు తగ్గిన కేంద్రం!
ఆంధ్రప్రదేశ్ దీనిమీద అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత పలు రాష్ట్రాలు కూడా విద్యుత్ సంస్కరణల ముసయిదా ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న అంశాలు సరిగానే ఉన్నాయని ప్రభుత్వానికి మద్దతు పలికాయి. దీనిపై ఏపీ తర్వాత దాదాపు పదిహేను రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు రావడంతో కేంద్రం ఈ ముసాయిదా విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కొనసాగింపుకు, ధరలను నిర్ణయించుకునే సౌలభ్యం ఇక రాష్ట్రాలకు దక్కినట్లే…