iDreamPost
android-app
ios-app

ఆకాశాన్ని అంటిన టమాటా ధరలు.. కిలో రూ.250.. ఎక్కడంటే..

ఆకాశాన్ని అంటిన టమాటా ధరలు.. కిలో రూ.250.. ఎక్కడంటే..

టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో రేటుతో కొనాలనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు టమాటా ఊసే మర్చిపోయారు. ప్రస్తుతం టమాట ధర కనిష్టంగా 100 రూపాయలు.. గరిష్టంగా 250 రూపాయలు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో టమాటా ధర 100 నుంచి 160 వరకు ఉంటోంది. ఉత్తర భారతదేశంలో అయితే, పరిస్థితి దారుణంగా ఉంది. కిలో టమాటా 180-250 పలుకుతోంది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో కిలో టమాటా ధర 250 రూపాయలుగా ఉంది.

ఇక, ఉత్తర కాశి జిల్లాలో 200 రూపాయలుగా ఉంటోంది. గంగోత్రి, యమునోత్రిలోనూ టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. 200-250 వరకు ఉంటోంది. టమాటా ధరలు ఒక్కసారిగా పెరగటంతో జనం అల్లాడిపోతున్నారు. అసలు టమాటా కొనుక్కుని తినడానికి భయపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో టమాటా ధరలు ఇంతలా పెరగటానికి ప్రధాన కారణం వర్షాలు. వర్షాల కారణంగా కేవలం టమాటానే కాదు.. ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి.

ఇతర రాష్ట్రాల్లో టమాటా ధరలు

తమిళనాడులో కిలో టమాటా ధర 100 నుంచి 130 రూపాయలు పలుకుతోంది. పెరిగిన టమాటా ధరల కారణంగా ప్రజలు ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సీడీ ద్వారా టమాటాను అందిస్తోంది. కిలో కేవలం 60 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ సబ్సీడీ టమాటా కేవలం చెన్నైలోనే అందుబాటులో ఉంది. ఇక, కర్ణాటకలో కిలో టమాటా ధర 101-120 మధ్య ఉంది. ఢిల్లీలో 150 రూపాయలు.. మహారాష్ట్రలో 160.. ఉత్తర ప్రదేశ్‌ 160 రూపాయలు.. కలకత్తాలో 150 రూపాయలు ధర పలుకుతోంది.