Dharani
Dharani
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు గుణశేఖర్. ఆయన చిత్రాలంటే భారీ సెట్‌లు, సెట్టింగ్‌లే ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. ఒక్కడు, అర్జున్ వంటి చిత్రాల్లో ఆయన వేసిన సెట్‌లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న గుణశేఖర్.. గత కొంతకాలంగా వరుస ప్లాఫ్‌లే చవి చూస్తున్నారు. రుద్రమ దేవి సినిమా విజయం సాధించినప్పటికి ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా ఆయన కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా అపజయం సమంత కెరీర్‌లో కూడా అతి పెద్ద డిజాస్టర్‌గా ఉండిపోయింది. ఇప్పుడు ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. పైగా శాకుంతలం ప్లాఫ్ తర్వాత.. గుణశేఖర్ గతంలో ప్రకటించిన చిత్రం కూడా ఆగిపోయింది.
గుణశేఖర్ 2019లో హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు గుణశేఖర్. కరెక్ట్‌గా చెప్పాలంటే.. ఇది గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అయితే హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ లేట్ అవుతుండేలా ఉండటంతో.. ఈలోపు శాకుంతలం స్టార్ట్ చేశారు గుణశేఖర్. ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో గుణశేఖర్ కెరీర్ ప్రమాదంలో పడింది అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. శాకుంతలం సినిమా రిజల్ట్.. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు చెక్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది.
ఏం జరిగింది అంటే తాజాగా రానా హిరణ్యకశ్యప సినిమాలో నటించబోతున్నట్లు.. దీనికి త్రివిక్రమ్ కథ అందిసుస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో ఎక్కడా గుణశేఖర్ పేరు ప్రస్తావించలేదు. దాంతో తాను నటించబోయే హిరణ్యకశ్యప చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ కాదని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రానా. ఈ ప్రకటన టాలీవుడ్‌లో చిచ్చు రాజేసిందని చెప్పవచ్చు. రానా ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తన అసహనాన్ని ట్వీట్ రూపంలో వెళ్లగక్కారు దర్శకుడు గుణశేఖర్.
‘‘దేవుడిని మీ కథకు ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నప్పడు.. ఆ దైవం.. మీ చిత్తశుద్దిని గమనిస్తూ ఉంటాడని మీరు గుర్తుంచుకోండి. అనైతిక చర్యలకు నైతిక విలువలతో సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అంటూ గుణశేఖర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గుణశేఖర్ తన ట్వీట్‌లో ఎక్కడా రానా, త్రివిక్రమ్‌ల పేర్లు ప్రస్తావించనప్పటికి.. వారి గురించే దర్శకుడు ఈ ట్వీట్ చేసినట్లు అందరూ భావిస్తున్నారు.
While making God the central theme of your story, you must also keep in mind that God keeps an eye on your integrity. Unethical acts will be answered through ethical means 🙏 pic.twitter.com/jc72pEsZb9
— Gunasekhar (@Gunasekhar1) July 19, 2023