Venkateswarlu
Venkateswarlu
డ్రగ్స్ వినియోగం, సరఫరా నేరం అన్న సంగతి తెలిసిందే. దీన్ని నూటికి 90 శాతం దేశాలు నేరంగానే పరిగణిస్తాయి. అయితే, కొన్ని దేశాల్లో డ్రగ్స్ విషయంలో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. సింగపూర్‌లో.. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి.. 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ సరఫరా చేస్తూ పట్టుబడితే ఉరి వేసేస్తారు. ఇందులో ఆడ, మగ అన్న తేడా లేదు. తాజాగా, డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఓ మహిళను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. దాదాపు 19 ఏళ్లలో ఓ మహిళను డ్రగ్స్ సరఫరా కేసులో ఉరి తీయటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం.
ఆ వివరాల్లోకి వెళితే.. 2018లో సింగపూర్‌కు చెందిన సరిదేవి బ్జామనీ అనే 45 ఏళ్ల మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడింది. ఆమె వద్ద నుంచి నార్కోటిక్స్ అధికారులు 31 గ్రాముల డొపమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ రూల్స్ ప్రకారం ఆమె దగ్గర 15 గ్రాముల కంటే ఎక్కువ డ్రగ్స్ దొరకటంతో.. 2018లోనే ఉరి శిక్ష ఖరారైంది. అయితే, దీనిపై మానవ హక్కుల సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. దేశంలో ఎక్కువ శాతంలో ఉరి శిక్షలు అమలవుతున్నాయని పేర్కొన్నాయి.
ప్రతీ నెలా ఓ ఉరి శిక్ష అమలవుతోందని వెల్లడించాయి. ఇక, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఉరి శిక్షను ఆపలేదు. దీంతో ఈ శుక్రవారం సరిదేవి బ్జామనీ అధికారులు ఉరి తీశారు. గత సంవత్సర కాలంలో సింగపూర్ ప్రభుత్వం మొత్తం 15 మందిని ఉరి తీసింది. వారిలో వికలాంగులు, విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. మరి, డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ మహిళను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.