iDreamPost

ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే?

ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే?

జూలై గడిచిపోయింది. ఈ నెల తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నవి, మంచి బిజినెస్ చేసుకున్న సినిమాలు అయిదు వచ్చాయి. పక్కా కమర్షియల్ బోణీ డిజాస్టర్ కొట్టగా అంతకన్నా దారుణంగా హ్యాపీ బర్త్ డే హ్యాండ్ ఇచ్చింది. రామ్ కష్టపడి చేశాడనే పాజిటివ్ బజ్ తో వచ్చిన ది వారియర్ సైతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఇక నాగ చైతన్య థాంక్ యు గురించి చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. మొన్న కొన్ని సి సెంటర్లలో 70 రూపాయల టికెట్లను వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద అమ్మినట్టుగా మెయిన్ మీడియాలోనే వార్తలు వచ్చాయి. ఇక నిన్న రామారావు ఆన్ డ్యూటీ విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం. ఖిలాడీకి ఏ మాత్రం తీసిపోని రిజల్ట్ అందుకుంది.

సరే వీటి టాక్ ఎలా ఉన్నా థియేటర్ల దగ్గర జనం క్రమంగా బాగా పల్చబడిపోతున్న విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇళ్ల నుంచి కదలడం లేదు. యూత్ సైతం ఎంటర్ టైన్మెంట్ కోసం వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నాయి. సినిమాలు బాలేవనేది పక్కన పెడితే కనీసం ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ ఫుల్ అవ్వాల్సిన బొమ్మలు సైతం షాక్ ఇస్తున్నాయి. మరి ప్రేక్షకులు రావాలంటే ఏం చేయాలనే ప్రశ్న తలెత్తడం సహజం. అందరూ మంచి కంటెంట్ ఇవ్వాలనే సలహా ఇస్తున్నారు కానీ నిజానికి నిన్న అలాంటి క్వాలిటీతోనే వచ్చిన పంచతంత్ర కథలను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.

ముందు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఇష్యూ టికెట్ రేట్లే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనుకున్నట్టు మల్టీప్లెక్స్ ధరలను 150 రూపాయల లోపే నియంత్రించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. సింగల్ స్క్రీన్ల బాల్కనీని 100కు పరిమితం చేస్తే తద్వారా సెకండ్ థర్డ్ క్లాస్ లు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. ఎక్కువ రేట్ కు పది మంది రావడం కన్నా తక్కువ ధరలతో నూటా యాభై ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడమే లాభసాటి. ఈ కోణంలో ముందుగా ఆలోచిస్తే తప్ప పరిష్కారం దొరకదు. ఓటిటి పరంగా చేయాల్సిన సవరణలు కూడా కీలకమే కానీ మరీ పది వారాల నిడివి ఎక్కువ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. జనాలు ఇప్పటికే వారం వారం మారుతున్న నైజామ్ టికెట్ రేట్లతో విపరీతమైన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వీలైనంత త్వరగా అన్నీ చక్కదిద్దాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి