iDreamPost

స్టార్ హీరోలకు ఈ వేగం అవసరం

స్టార్ హీరోలకు ఈ వేగం అవసరం

ఒకప్పుడు చిరంజీవి కృష్ణ లాంటి హీరోలు ఏడాదికి పది పన్నెండు సినిమాలు చేశారంటే ఇప్పటి జెనరేషన్ నమ్మరేమో. కానీ ఇది నిజం. ఏకధాటిగా షూటింగ్సే ప్రపంచంగా నెలకో విడుదల ఉండేలా చూసుకున్న ఘనత వీళ్లది. కాలక్రమేణా ఈ వేగం తగ్గింది కానీ వయసు రిత్యా చూసుకుంటే యాభై పదుల వయసులోనూ ఇలాంటి స్టార్లు ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. పెద్ద హీరో ఏడాదికి కనీసం ఒక్క సినిమా విడుదలయ్యేలా చేసుకుంటే అదో పెద్ద ఘనత. కరోనా రాకముందు కూడా మనవాళ్ళది ఇదే పరిస్థితి. రెమ్యునరేషన్లు, వందల కోట్ల పాన్ ఇండియా మార్కెట్లు తప్ప ఇంకేదీ పట్టించుకోని వాతావరణం నెలకొంది.

పోలికని కాదు కానీ ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని మెచ్చుకోవచ్చు. నాన్ స్టాప్ గా ప్రాజెక్టులు చేస్తూ థియేటర్ ఓటిటి అనే తేడా లేకుండా నిర్మాతకు తనకు లాభసాటిగా నిలిచేలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ తో వచ్చే నెల రాబోతున్న ‘నవరస’తో కలిసి సూర్య చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. ‘జై భీం’ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఇది డిజిటల్ రిలీజ్ అనే ప్రచారం జరుగుతోంది. ‘ఎతర్కుం తునిన్దవన్’ లో మాస్ గెటప్ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ‘వడివాసల్’ మీద క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇవి కాకుండా టాలీవుడ్ లో ఒక స్ట్రెయిట్ కమర్షియల్ మూవీ చేసే ప్లాన్ లో కూడా సూర్య ఉన్నాడు.

ఈ లెక్కన చూసుకుంటే ఒకటి రెడీ ఫర్ రిలీజ్ కాగా మూడు షూటింగ్ స్టేజి లో ఉన్నాయి. ఎంతలేదన్నా ఇవన్నీ వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తవుతాయి. ఇంత వేగంగా చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. గజినీ తర్వాత తెలుగు మార్కెట్ ని వరస ఫెయిల్యూర్స్ ద్వారా తగ్గించుకున్న సూర్య ఆకాశం నీ హద్దురాతో మళ్ళీ పికప్ అయ్యాడు. ఇప్పుడు స్ట్రెయిట్ థియేటర్ మూవీ ద్వారా తన బిజినెస్ రేంజ్ ఏంటో క్లారిటీ వస్తుంది. పైన చెప్పిన సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ రూపంలో రాబోతున్నాయి. ఏది ముందు ఏది తర్వాత అనే క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య అభిమానులు నవరసని ఆగస్ట్ లో ఎంజాయ్ చేయొచ్చు. మిగిలినవి తర్వాత ప్రకటిస్తారు

Also Read: హంగామా 2 రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి