iDreamPost

స్టార్ హీరో ఓటిటి రూటు

స్టార్ హీరో ఓటిటి రూటు

గత ఏడాది లాక్ డౌన్ టైంలో మొదటగా విడుదలైన డైరెక్ట్ ఓటిటి సినిమా పొన్మగల్ వందాల్ వచ్చినప్పుడు దాని నిర్మాత సూర్య, హీరోయిన్ జ్యోతిక మీద డిస్ట్రిబ్యూటర్లు చిర్రుబుర్రుమన్నా ఆ ఇద్దరూ లెక్క చేయలేదు. ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసుకున్న ఆ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత దీన్నే ఆహా యాప్ తెలుగులో బంగారు తల్లి పేరుతో డబ్బింగ్ చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆకాశం నీ హద్దురాని సైతం సూర్య ప్రైమ్ కే ఇవ్వడం ఇంకా దుమారాన్ని రేపింది. ఇలా అయితే భవిష్యత్తులో సూర్య సినిమాలు పంపిణి చేయనివ్వమనే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయి. కట్ చేస్తే అది ఆన్ లైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చి లాక్ డౌన్ ఎత్తేశాక కూడా సూర్య తన పంధా మార్చుకోలేదు. పక్కా బిజినెస్ మెన్ లా ఆలోచిస్తూ సినిమాలు తీస్తూ తనకు ఏది లాభ సాటి అనిపిస్తుందో దానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. తాజాగా ఇతని లేటెస్ట్ మూవీ జై భీం నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఇందాకా అఫీషియల్ గా ప్రకటించారు. ఇదొక్కటే కాదు ఇతర ఆర్టిస్టులతో తన 2డి బ్యానర్ పై నిర్మించిన ఓ మై డాగ్, ఉదన్ పిరప్పే, రామే రావనే కూడా ప్రైమ్ లోనే నెలకొకటి చొప్పున విడుదల చేస్తున్నారు. ఆఖరుది తప్ప అన్నీ తెలుగు డబ్బింగ్ రూపంలోనూ అందివ్వబోతోంది ప్రైమ్.

నెట్ ఫ్లిక్స్ లో నవరస సిరీస్ లో నటించిన సూర్య డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ భవిష్యత్తు ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నాడు. అలా అని థియేటర్ మూవీస్ కి దూరంగా జరగడం లేదు. వడివాసల్ తో సహా నిర్మాణంలో ఉన్న మరో రెండు చిత్రాలు కేవలం బిగ్ స్క్రీన్ కోసమే చేస్తున్నాడు. పెట్టుబడి లాభం సూత్రాన్ని అనుసరిస్తూ సూర్య తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఇంకొందరికి స్ఫూర్తినివ్వడం ఖాయం. బిగ్ స్క్రీన్ స్మార్ట్ స్క్రీన్ కు మధ్య ఉన్న దూరాన్ని ఇలాంటి స్టార్లు క్రమంగా దూరం చేయడం మంచిదే కానీ ఈ రెండు పడవల ప్రయాణం ఎంత దూరం వెళ్లగలదు అనేదే అసలు ప్రశ్న. దానికి జవాబు చెప్పేది కాలమే

Also Read : రిలీజుల కన్నా కలెక్షన్ల మీదే కన్ను

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి