iDreamPost

వీడియో: గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన పాము.. కొద్దిలో తప్పించుకున్న క్రికెటర్!

  • Author singhj Published - 09:55 AM, Mon - 14 August 23
  • Author singhj Published - 09:55 AM, Mon - 14 August 23
వీడియో: గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన పాము.. కొద్దిలో తప్పించుకున్న క్రికెటర్!

మన దేశంలో క్రికెట్​ను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి! సినిమాలతో పాటు క్రికెట్​ అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాదు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి మిగిలిన ఆసియా దేశాల్లో జెంటిల్మన్ గేమ్​ను ఇష్టపడేవారు కోట్లాది సంఖ్యలో ఉన్నారు. ఆసియా దేశాల్లో క్రికెట్​ను ఒక మతంలా, క్రికెటర్లను దేవుళ్లలా భావిస్తారని చెప్పడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. మ్యాచ్ జరుగుతోందంటే చాలు.. ప్రేక్షకులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అదృష్టం బాగుండి టికెట్ దొరికితే నేరుగా స్టేడియంలోనే తమ ఆరాధ్య ఆటగాళ్ల క్రీడా విన్యాసాలను చూసి ఆనందిస్తారు.

క్రికెట్ మ్యాచ్​ల టికెట్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి క్రేజీ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్​లతో పాటు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​లకు టికెట్లకు రెక్కలు వచ్చేస్తాయి. ఇదిలా ఉంటే.. స్టేడియాల్లో ఒక్కోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. మైదానాల్లో క్రికెటర్లు సీరియస్​గా ఆడుతున్న టైమ్​లో నిరసనకారులు, ఫ్యాన్స్ రావడాన్ని చూశాం. కొన్నిసార్లు కుక్కలు, పిల్లులు లాంటి జంతువులు వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగే ఒక మైదానంలో పాము వచ్చింది. ఈ ఘటన పొరుగు దేశం శ్రీలంకలో చోటుచేసుకుంది.

లంక ప్రీమియర్ లీగ్​లో భాగంగా గాలె టైటాన్స్-దంబుల్లా ఆరా జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో అవుట్ ఫీల్డ్​లోకి ఒక పెద్ద పాము వేగంగా పాకుతూ లోపలికి వచ్చింది. అదే టైమ్​లో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పేస్ బౌలర్ ఇసురు ఉదాన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. అయితే హఠాత్తుగా పామును గమనించిన అతడు.. దానికి దూరంగా జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం గ్రౌండ్స్​మెన్ ఆ పామును పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. స్టేడియంలోకి పాము వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి