iDreamPost

అది మన ఆహారం కాదు.. షవర్మాపై బ్యాన్..

అది మన ఆహారం కాదు.. షవర్మాపై బ్యాన్..

ఇటీవల కేరళలో పాడైన షవర్మా(Shawarma) తిని ఒకరు మరణించి, పలువురు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు(Tamilanadu)లో ఈ షవర్మాని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేస్తున్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి కూడా షవర్మా తినొద్దు, అది మన ఆహరం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు వెల్లూరు జిల్లాలోని గుడియాథం మున్సిపాలిటీలో షవర్మాపై నిషేధం విధించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరితో మీటింగ్ పెట్టి తమ తమ మున్సిపాలిటీ పరిధిలో షవర్మాని నిషేధిస్తున్నట్టు ఆ నగర మేయర్ సౌందరరాజన్ తెలిపారు. షవర్మా తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

అయితే తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ”షవర్మా భారతీయ వంటకాల్లో భాగం కాదు. అది పాశ్చాత్య దేశాల ఆహారం. ఆ దేశాలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షవర్మా వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలోకి వెళ్తుంది కాబట్టి కొన్ని పదార్థాలు బయట ఉంచినా చెడిపోవు. మాంసాహారం లాంటి కొన్ని పదార్థాలు ఫ్రీజర్‌లో, సరైన పద్దతిలో నిల్వ ఉంచకపోతే పాడైపోతాయి. మన దేశంలో వాతావరణ పరిస్థితులు వేరు. చెడిపోయిన ఆహార పదార్థాలని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే షవర్మాని తినకండి అని తెలిపారు.

అయితే దీనిపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, డాక్టర్లు కూడా షవర్మాకి దూరం ఉంటేనే మంచిదని అంటున్నారు. మరి షవర్మా పై ఈ నిషేధం తమిళనాడు అంతటా విస్తరిస్తారా? లేదా చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి