iDreamPost

పవన్ సినిమాకు వర్షం షాక్

పవన్ సినిమాకు వర్షం షాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న విరుపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)కు వర్షం షాక్ ఇచ్చిందట. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేసిన కోటి రూపాయల సెట్ వర్షానికి బాగా డ్యామేజ్ అయినట్టుగా తెలిసింది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల ఔట్ స్కర్ట్స్ లో వేసిన ఈ సెట్టింగ్ ఇప్పటికిప్పుడు షూటింగ్ చేయలేని స్థాయిలో దెబ్బ తిందట. భారీ పురాతన భవనాలు, యుద్ధ సామాగ్రి, కోట నమూనాలు, సైన్యం డ్రెస్సులు వగైరా అన్నీ వర్షార్పణం అయ్యాయట. తిరిగి మళ్లీ పునర్నిర్మాణం చేయడం తప్ప మరో ఆప్షన్ లేని స్థాయిలో నష్టం కలగడంతో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ ఆఘమేఘాల మీద తర్వాత ఏం చేయాలనే దాని మీద చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఇప్పటిదాకా పక్కా ప్లానింగ్ తో యూనిట్ ఇప్పుడీ రూపంలో పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. అయితే ఇందులోనూ ఊరట కలిగించే అంశం మరొకటుంది. పవన్ ముందు వకీల్ సాబ్ బాలన్స్ ని పూర్తి చేయాలి. దానికి ఎంత లేదన్నా కనీసం నెల రోజులకు పైగా అవసరం ఉంటుంది. ఆ తర్వాత డబ్బింగ్, ప్రమోషన్ తదితర కార్యక్రమాలకు ఇంకో ఇరవై ముప్పై రోజులు ఇవ్వాల్సి వస్తుంది. ఆలోగా సెట్ ని మళ్లీ వేయడంతో పాటు దానికి సంబంధం లేని సీన్లు ఏవైనా ఉంటే వాటిని పవన్ డేట్స్ కి తగ్గట్టుగా పూర్తి చేయాలి. అయితే హైదరాబాద్ లో షూటింగులకు అనుమతులు ఇచ్చినా ఇంకా పెద్ద హీరోల ప్రాజెక్టులు ఏవీ ప్రారంభం కాలేదు.

ఇంకా వైరస్ అదుపులోకి రాని కారణంగా ఇంకొన్ని రోజులు వేచి చూడాలనే ధోరణిలో స్టార్లు ఉన్నారు. హీరోయిన్లు సైతం ఇదే మాట అంటున్నారు. ఈ లెక్కన క్రిష్ టీమ్ కి అదనపు సమయం దొరుకుతుంది. మొత్తానికి కరోనా దెబ్బ అందరి మీదా మాములుగా లేదు. గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయడం మాటల్లో చెప్పుకున్నంత సులువుగా ఆచరణలో ఉండదని అగ్ర నిర్మాతల కామెంట్. పవన్ సెట్ కు సంబంధించిన న్యూస్ అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ దీని చర్చ మాత్రం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. బాలీవుడ్ ఫేమ్ జాక్వలిన్ ఫెర్నాన్ డెజ్, అర్జున్ రామ్ పాల్ తో పాటు మలయాళం స్టార్ జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి