iDreamPost

ప్రజారోగ్యాన్ని నమిలేస్తున్న ‘గుట్కా’

ప్రజారోగ్యాన్ని నమిలేస్తున్న ‘గుట్కా’

గుట్కా, పాన్‌పరాగ్, ఖైనీ, రాజ్‌మసాలా.. ఇలా పేరేదైనా గానీ ప్రజా రోగ్యంపై ఇవన్నీ తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల వీటిని నిషేధించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెసులు బాట్లు, పాన్‌ మసాల పేరిట లైసెన్స్‌లు తీసుకుని గుట్కా పదార్ధాలు తయారు చేయడం వంటివి జరుగుతున్నాయని భద్రతా వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల సరుకు సరిహద్దులు దాటి రాష్ట్రాల్లోకి చేరుతోంది.

పోలీసు వర్గాలకు ఉండే పని ఒత్తిడి నేపథ్యంలో వీటిని అరికట్టడంపై అంతంత మాత్రంగానే దృష్టిపెడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో మారుమూలనున్న గ్రామాల్లోని కిళ్ళీ బడ్డీల్లో సైతం విచ్చలవిడిగానే ఇవన్నీ దొరికేస్తున్నాయి. ఒకప్పుడు ఒకటి రెండు రూపాయలకే దొరికే ఈ ప్యాకెట్లు ఇప్పుడు రూ. 25ల నుంచి రూ. 60ల వరకు అమ్ముతున్నారంటే వీటిని వాడేవారు ఎంతగా బానిసలుగా మారిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

అడపాదడపా పోలీస్‌లు దాడులు చేస్తుండడంతో అత్యంత రహస్యంగా, తెలిసిన వారికి మాత్రమే వీటి అమ్మకాలు సాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈబీ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంలో కొరఢాఝళిపిస్తోంది. దీంతో లక్షలాది రూపాయల విలువైన గుట్కా బైటపడుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 35 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారంటే ఈ వ్యాపార విస్తృతి ఎంతగా విస్తరించిపోయిందో అర్ధం చేసుకోవచ్చును. కోరుకొండలో రూ. 25లక్షలు, కత్తిపూడిలో రూ. 10లక్షల విలువైన గుట్కా సంబంధిత ప్యాకెట్లు పోలీస్‌లకు చిక్కాయి. దీనితో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

చైన్‌లింక్‌ విధానంలో సాగుతున్న ఈ బిజినెస్‌ మూలాల్ని ఛేధించడం పోలీసు వర్గాలకు కష్టతరంగానే మారిపోతోంది. పంపిణీదారులు, హోల్‌ సేల్, రిటైల్‌ వ్యాపారులను మాత్రమే దాడుల్లో పట్టుబడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులను దాటించే బడా వ్యాపారులు మాత్రం ఎక్కడా పట్టుబడుతున్న దాఖలాల్లేవు. దీంతో ఒక చోట దొరికిపోయినా మరో మార్గంలో వారు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో మరింత విస్తృతంగా దాడులు చేయడం ద్వారా సంఘవిద్రోహ చర్యలకు పాల్పడేవారి ఆటకట్టించేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి