iDreamPost

ఫించన్‌ డోర్‌ డెలివెరీ ఎందుకు..? కాదు కాదు మంచిదే..! రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఐవైఆర్‌ ట్వీట్లు

ఫించన్‌ డోర్‌ డెలివెరీ ఎందుకు..? కాదు కాదు మంచిదే..! రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఐవైఆర్‌ ట్వీట్లు

పింఛన్‌ డోర్‌ డెలివెరీ కార్యక్రమాన్ని విమర్శిస్తూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు పెట్టిన ట్వీట్‌ తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ విధానం మంచిదే అంటూ ఆయన మళ్లీ ట్వీట్‌ చేసే స్థాయికి ఆయన ట్వీట్‌కు స్పందన వచ్చింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. పింఛన్‌ డోర్‌ డెలివెరీ కార్యక్రమాన్ని జగన్‌ సర్కార్‌ గత నెల నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మార్చి ఒకటో తేదీన కూడా వాలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంపై ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది.

సదరు ప్రకటనను జత చేస్తూ ఐవైఆర్‌.. ‘‘ సాంకేతికత అభివృద్ధి చెంది నిమిషాల్లో ఫించను నగదు బ్యాంకు అకౌంట్‌లో జమ చేసే ఈ రోజుల్లో గడప వద్ద ఫించన్‌ పంపిణీ అవసరమా..? ప్రభుత్వ సొమ్ము మేము సొంతంగా ఇస్తున్నాం అన్న భావన కల్పించడానికి తప్పితే దీని వలన అదనంగా కలిగే ప్రయోజనం శూన్యం.’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు, సలహాలు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు విద్యావంతులు కూడా ఫించన్‌ డోర్‌ డెలివెరీ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరిస్తూ పోస్టులు పెట్టారు. ఐవైఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ డోర్‌ డెలివరీ వల్ల లాభం.. ఇదంటూ మంచంలో లేవలేని వృద్ధులకు పింఛన్లు అందిస్తున్న వాలంటీర్ల ఫొటోలు పెట్టారు.

దీంతో మళ్లీ ఐవైఆర్‌ స్పందిచారు. తన ట్వీట్‌ చర్చకు దారితీయం మంచిదేనన్నారు. ‘‘ఈ ట్వీట్‌కు వచ్చిన వ్యాఖ్యలు చూసిన తర్వాత వృద్ధులకు ఫించన్లు వారి ఇంటి వద్దనే ఇవ్వడం మంచిది అని అనిపిస్తోంది. ఈ విధానానికి సవరణలు ఆలోచిస్తే తీసుకొనవచ్చు. ప్రతి వృద్ధుడిని ఈ నెలలో వాలంటీర్లు కలిశారు కాబట్టి లేవలేని రాలేని వాళ్లకు ఈ విధానం కొనసాగించవచ్చు.’’ అంటూ ఐవైఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఐవైఆర్‌ మళ్లీ స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోపాటు, డోర్‌ డెలివెరీ విధానం మంచిది.. కొనసాగించవ్చంటూ పేర్కొనడంతో సదరు ట్వీట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సీనియర్‌ ఐఏఎస్‌ అసలు విషయం గుర్తించినందుకు నెటిజన్లు ధన్యవాదాలు కూడా చెప్పారు. కాగా గత ప్రభుత్వ హాయంలో ఫించన్‌ నగదు బ్యాంకులో జమ చేసే విధానం అమలు చేశారు. అయితే దాని వల్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే వెయి రూపాయల ఫించన్‌ నగదు తీసుకునేందుకు వృద్ధులు బ్యాంకులకు రావడం, క్యూలో గంటల కొద్దీ నిల్చోవడం వంటి ఆపసోపాలు పడ్డారు. ఫలితంగా ప్రభుత్వం ఒక్క నెలకే ఆ విధానానికి స్వస్తి చెప్పింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి