iDreamPost

నాలుగో‘సారి’..

నాలుగో‘సారి’..

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కరోనా సమయంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రగతి రథ చక్రాల పరుగు ఆగి ఏడు నెలలు కావస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత దేశ వ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైనా.. తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం పునఃప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల బస్సులు ఆయా రాష్ట్రాల పరిధిలో ఎన్ని కిలోమీటర్లు తిరగాలనే అంశంపై వివాదం నెలకొంది.

ఈ వివాదం పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీ) పలుమార్లు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. తాజాగా బుధవారం నాలుగోసారి జరిపిన చర్చల్లో కూడా ప్రతిష్టంభన వీడలేదు. వాస్తవంగా ఏపీ బస్సులు తెలంగాణ పరిధిలోకి ఎక్కువ తిరుగుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో తక్కువ కిలోమీటర్లు నడుస్తున్నాయి. దీని వల్ల తమకు నష్టం వస్తోందని తెలంగాణ అధికారులు సమస్యను లేవనెత్తారు. బస్సు సర్వీసులు కరోనా వల్ల నిలిచిపోగా.. తిరిగి ప్రారంభించే సమయంలో తెలంగాణ అధికారులు కిలోమీటర్ల పేచీని పెట్టారు. ప్రతి రోజూ 70 వేల కిలోమీటర్ల మేర సమానంగా బస్సులు తిప్పుదామని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ అధికారులు స్పందించలేదు.

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీలు నడపాల్సిన అవసరం ఎంతో ఉంది. బస్సు సర్వీసులు తిప్పడంపై తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ బాధ్యత ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఏపీ వాసులు ఎక్కువ మంది ఉపాధి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఉంటున్నారు. ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో ఏపీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్లక తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు కార్‌ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తూ జేబులను గుల్ల చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులను తిప్పేందుకు గత నెలలో ప్రైవేటు బస్సు ట్రావెల్స్‌కు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునే పనిలో ట్రావెల్స్‌ సంస్థలు టిక్కెట్ల ధరలను పెంచి విక్రయిస్తున్నాయి.

పండగ సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో దసరా పండగ ఆ తర్వాత దిపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసగా రాబోతున్నాయి. ఈ లోపు బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించకపోతే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారు. సాధారణంగా పండగ సీజన్‌లలో అధిక రేట్లు టిక్కెట్లను విక్రయించే ప్రైవేటు ట్రావెల్స్‌ ఈ సారి భారీ మొత్తంలో ప్రయాణికులను దోపిడీ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు బస్సు సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలకు మరింత నష్టం జరుగుతోంది. ఏపీ మూడు కోట్ల రూపాయలు, తెలంగాణకు రెండు కోట్ల రూపాయల మేర ప్రతి రోజు నష్టపోతున్నాయి. భవిష్యత్‌లో దీని ప్రభావం రెండు సంస్థలపై తీవ్రంగా పడే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి