iDreamPost

రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ స్థాయిలో!

రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ స్థాయిలో!

దేశమంతా మనవైపు తిరిగిచూసేలా పరిపాలన చేస్తాను అని అన్నవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే రైతులకు భరోసా కల్పించేందుకు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా మారింది. విత్తనం చల్లడం మొదలు వచ్చినపంట అమ్ముకునే వరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఏ గ్రామానికి ఆ గ్రామంలో భరోసా కల్పిస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా కేంద్రాలకు ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్‌’’ అవార్డుకు ఆర్బీకేలను కేంద్రప్రభుత్వం నామినేట్‌ చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుకు నామినేట్‌ అయ్యాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజంవేసిన ఆర్బీకేలకు మరింత గుర్తింపు దక్కనుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

జగన్ ముందుచూపు కారణంగా సచివాలయాలకు అనుబంధంగా గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. 2020 మే 30న ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇలా నాణ్యమైన సాగుకు సంబందించిన అన్నీ అందించడమే కాకుండా రైతు పండించిన పంటను కూడా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఇప్పుడు ఎఫ్‌ఏవో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ కావడం మరో అరుదైన గౌరవమనే చెప్పాలి.

ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డు కోసం ఎఫ్‌ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. అనేక దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో ఫిల్టర్ చేసి అంశాలవారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐక్యరాజ్యసమితి అత్యున్నత కౌన్సిల్‌ ఎంపిక చేస్తుంది. జూన్‌ 13 నుంచి 17వ తేదీ వరకు ఐక్యరాజ్యసమితిలో జరిగే ఎఫ్‌ఏవో 169 వ కౌన్సిల్‌ సమావేశంలో డైరెక్టర్‌ జనరల్‌ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు లేదా ప్రభుత్వాలకు ఛాంపియన్‌ అవార్డును ప్రదానం చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి