iDreamPost

ట్రేసింగ్ లో టాప్ : కొత్త క‌రోనా విష‌యంలోనూ ఏపీ ముంద‌డుగు

ట్రేసింగ్ లో టాప్ : కొత్త క‌రోనా విష‌యంలోనూ ఏపీ ముంద‌డుగు

ఇప్పుడు ప్ర‌పంచాన్ని కొత్త క‌రోనా వ‌ణికిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్‌ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్‌ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిట‌న్‌లో వెలుగు చూసిన ఓ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్‌ కరోనా వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. అప్ప‌టికే కొంత మంది స్వ‌రాష్ట్రాల‌కు చేరుకున్నారు. నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్‌ సహా ఇతర దేశాల నుంచి 3000 మంది తెలంగాణకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందింది. వారిలో ముందు వచ్చిన 1,500 మందిని మెడికల్‌ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారిలో చాలా మంది ఆచూకీ ఇంకా తెలియ‌లేదు. ఇప్ప‌టికే యూకే నుంచి మ‌న దేశానికి వ‌చ్చిన‌వారిలో 6గురికి స్ట్రెయిన్ క‌రోనా నిర్దార‌ణ అయిన‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.

దాదాపు ట్రేస్ చేశాం..

కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని, యూకే నుంచి వారిలో దాదాపు అంద‌రినీ ట్రేస్ చేశామ‌ని ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని స్పష్టం చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్‌ చేశామని పేర్కొన్నారు. 1406 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్‌ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి