iDreamPost

ఏపీకొచ్చింది కొత్తదా? పాతదా?

ఏపీకొచ్చింది కొత్తదా? పాతదా?

కోవిడ్‌ 19 కొత్తరూపం సంతరించుకోవడం ఒకెత్తయితే, అది నేరుగా బ్రిటన్‌ నుంచి ఏపీలోకి ప్రవేశించిందన్న వార్తలు మరో రకమైన ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. యూకే నుంచి ఆంగ్లో ఇండియన్‌ తల్లి, కుమారుడు నేరుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు నానా హడావిడీ చేస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠత రేకెత్తించింది. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేసి, అసలేం జరుగుతోంది అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

అయితే రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి ప్రకటనతో కాస్తంత ఊరట లభించిందనే చెప్పాలి. తిరుగు ప్రయాణంలో ఉన్న ఈ తల్లి, కొడుకులకు చేసిన వైద్య పరీక్షల్లో కోవిడ్‌ 19 ఉందని తేలడం వాస్తవం. అయితే అది కొత్తగా, పాతదా అన్నది ఇంకా ఖరారు కాలేదన్నది సబ్‌కలెక్టర్‌ ప్రకటన సారాంశం. సంబంధిత నిర్ధారణకు సదరు వ్యక్తుల జీనోమ్‌ను పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు పంపించినట్లుగా వివరించారు.

అంతే కాకుండా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వారిద్దరిని సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. అలాగే సదరు భోగీని శానిటైజ్‌ చేసామన్నారు. అంతే కాకుండా వీరితో ప్రయాణించిన వారి వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కొత్తగా వైరస్‌ గుర్తించిన యూకే నుంచి వీరిద్దరూ వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పౌరుల బాధ్యతలపై చర్చ..

కోవిడ్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఈ ఘటన చాటిచెబుతోంది. ఇతర దేశాలు, ప్రదేశాల్లో తిరిగిన వారు తప్పని సరిగా 14 రోజులు క్వారంటైన్‌ నిబంధనను పాటించడం తప్పని సరి. ఈ బాధ్యతను గనుక సక్రమంగా వ్యవహరించకపోతే తోటి ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళవుతారనడంలో సందేహం లేదు. పైన చెప్పుకున్న మహిళ విషయంలో ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో యంత్రాంగం మొత్తం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న యంత్రాంగాన్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజల భద్రత కోసం జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారన్న విషయం ఇక్కడ మార్చిపోకూడదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి