iDreamPost

దుర్గం చెరువులో దూకిన విద్యార్థిని.. సినిమా స్టైల్లో కాపాడిన పోలీసులు!

దుర్గం చెరువులో దూకిన విద్యార్థిని.. సినిమా స్టైల్లో కాపాడిన పోలీసులు!

ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి హాలీవుడ్‌ సినిమాల్లో అయితే.. సూపర్‌ హీరోస్‌ ఉంటారు. జనాలకు ప్రాణ హాని ఉందని తెలిస్తే చాలు రంగంలోకి దిగిపోతారు. శత్రువులతో పోరాడి.. వారిని ఓడించి మరీ జనాల్ని కాపాడతారు. అయితే, నిజ జీవితంలో మాత్రం సూపర్‌ హీరోస్‌ ఉండరు. కాబట్టి.. సూపర్‌ హీరోస్‌ పాత్రని పోలీసులే పోషిస్తూ ఉంటారు. తాజాగా, చెరువులో దూకిన ఓ విద్యార్థినిని పోలీసులు ఎంతో చాకచక్యంగా కాపాడారు. సూపర్‌ హీరోస్‌లాగా ఎంట్రీ ఇచ్చి ఆమెను రక్షించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ యువతి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ మధ్య కాలంలో ఆ యువతి సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతోంది. దీంతో తల్లి ఆమెను మందలించింది. సెల్‌ఫోన్‌ అధికంగా వాడవద్దని హెచ్చరించింది. తల్లి తనను తిట్టడంతో యువతి మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం కాలేజీకని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చింది. కొంత సేపటి తర్వాత కాలేజీ యజమాన్యం ఆమె తల్లికి ఫోన్‌ చేసి కూతురు కాలేజీకి రాలేదని చెప్పింది. దీంతో యువతి తల్లిలో కంగారు మొదలైంది. తాను తిట్టడం కారణంగా కూతురు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయపడింది. వెంటనే కూతురి స్నేహితులకు ఫోన్‌ చేసింది.

యువతి ఎవ్వరి దగ్గరికీ వెళ్లలేదని తేలింది. తల్లిలో ఆందోళన మరింత పెరిగింది. వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. మధ్యాహ్నం వేళ యువతి దుర్గం చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే మాదాపూర్‌ పోలీస్‌లను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది పోలీసులు చెరువు దగ్గరకు వెళ్లారు. వారు అక్కడికి వెళ్లిన సమయంలోనే యువతి చెరువులో దూకింది. పోలీసులు వెంటనే యువతి బోటు సహాయంతో రక్షించారు. యువతికి ఎలాంటి ప్రాణహాని లేదని తెలుస్తోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి