iDreamPost

కూల్చేసిన గోడ ఇటుకల కోసం క్యూ కట్టిన జనం.. అసలు వాటిల్లో ఏముంది?

  • Author singhj Published - 02:43 PM, Sat - 5 August 23
  • Author singhj Published - 02:43 PM, Sat - 5 August 23
కూల్చేసిన గోడ ఇటుకల కోసం క్యూ కట్టిన జనం.. అసలు వాటిల్లో ఏముంది?

మన దేశంలో నమ్మకాలకు కొదువే లేదు. ఫలానా వస్తువుతో అదృష్టం కలిసొస్తుంది అంటే అది ఎంత ఖరీదైనా వెంటనే తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు చాలా మంది. అలాంటిది ఒక ఇటుక ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటే ఊరుకుంటారా? కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఇటుకల కోసం ప్రజలు భారీగా క్యూ కట్టారు. ఒక ప్రహరీ గోడ ఇటుకలు పట్టుకెళ్లేందుకు స్థానికులే కాదు.. ఏకంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు రావడం గమనార్హం. అయితే ఇవేవో బంగారు ఇటుకలు అనుకోకండి. ఇవి మామూలు మట్టి ఇటుకలే కానీ.. వాటినే మహా ప్రసాదంగా భావించి తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు భక్తులు.

వందల ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురంలో కొలువై ఉంది. ఈ ఆశ్రమాన్ని సూఫీ మత సిద్ధాంతాల ఆధారంగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ఈ ఆశ్రమాన్ని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఐదుగురు పీఠాధిపతులు ఈ ఆశ్రమాన్ని పర్యవేక్షించారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ ఉమర్ అలీ షా ప్రస్తుతం ఇక్కడ పీఠాధిపతిగా ఉన్నారు. రైతులకు దారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమంలో ఉన్న రక్షణ గోడను కూల్చేందుకు పీఠం నిర్వాహకులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆ గోడను కూల్చేశారు. అయితే ఐదుగురు పీఠాధిపతులు నడయాడిన స్థలం కావడంతో ఇక్కడ అద్భుత శక్తులు ఉంటాయనే నమ్మకంతో గోడ ఇటుకల కోసం జనాలు క్యూ కట్టారు.

విశ్వవిజ్ఞాన పీఠం మట్టి రేణువుల్లో అద్భుత శక్తులు ఉంటాయని జనాల నమ్మకం. అందుకే రక్షణ గోడ ఇటుకలను తీసుకెళ్లి, పూజగదిలో ఉంచి పూజలు చేసేందుకు వాటిని తీసుకెళ్లున్నారని కొందరు అంటున్నారు. కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు పునాదిరాయిగా ఈ ఇటుకల్ని ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఈ ఆశ్రమ ఇటుకల కోసం స్థానికులతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పిఠాపురం చేరుకున్నారు. ఆశ్రమ ఇటుకలను సంచుల్లో మూటగట్టుకొని మరీ ఇళ్లకు మోసుకెళ్లారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు భోజన ఏర్పాట్లు కూడా చేశారని సమాచారం. ఇటుకల కోసం జనాలు క్యూ కట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి