iDreamPost

నివురుగప్పిన నిప్పులా మహారాష్ట్ర..!

నివురుగప్పిన నిప్పులా మహారాష్ట్ర..!

మహారాష్ట్ర పాల్ఘార్‌ జిల్లాలో 16 తేదీ రాత్రి దొంగలనే నెపంతో/భావించి మూక దాడికి పాల్పడిన ఘటనలో చిక్నే మహరాజ్‌ కల్పవృక్షగిరి, సుశీల్‌గిరి మహరాజ్‌ అనే సాధువులు, డ్రైవర్‌ నీలేశ్‌ తెల్గాడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 9 మంది మైనర్ల సహా మొత్తం 110 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 101 మందిని ఏప్రిల్‌ 30 వరకు పోలీస్‌ కస్టడీకి తరలించగా, మైనర్లను జ్యువైనల్‌ కారాగారానికి తరలించారు. అయితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేకి ఫోన్‌ చేసి దాడికి పాల్పడినవారిని వదలొద్దంటూ సూచించడంతో బీజేపీ నాయకత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుందనే విషయం అర్థమవుతోంది. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి.

ఉద్దవ్‌ రియాక్షన్‌

అవానమీయ ఘటనకు పాల్పడిన వంద మందికి పైగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ వెల్లడించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించామన్నారు. ఘటనలో హిందు, ముస్లిం వివాదం లేదన్నారు. దొంగలంటూ పుకార్లు రావడం వల్లే సాధువులపై దాడి జరిగిందని, ఘటనను రాజకీయం చేయవద్దని సూచించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందుత్వానికి మేమే హక్కుదారులం అంటూ ప్రగల్భాలు పలిగే ఉద్దవ్‌.. అధికార పీఠం ఎక్కగానే హిందువుల ప్రాణాలకు విలువివ్వడం లేదంటూ మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.

పలు సందేహాలు….

లాక్‌డౌన్‌ సమయంలో రాత్రి వేళ అంత పెద్ద సంఖ్యలో వ్యక్తులు గుమ్మిగూడటంపై హిందుత్వ వాదులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందని..దానికి కారకులను పట్టుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కాగా దాడి చేసిన చేసినవారంతా ఆదివాసీలని…వీరంతా క్రిస్టియన్, ఇస్లాం మతంలోకి మారారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దాడి వెనుక పాల్ఘార్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే శ్రీనివాస్‌ వంగ హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

మతం రంగు పూయొద్దు…

అయితే కాంగ్రెస్, శివసేనలు మాత్రం ఈ ఘటనకు బీజేపీ మతం రంగు పూస్తోందంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ ఘటన జరిగిన ఘడక్‌చించలేకు చిత్రా చౌదరీ బీజేపీ నుంచి సర్పంచ్‌గా ఉన్నారని…గత పదేళ్లుగా ఆ గ్రామంలో బీజేపీయే అధికారంలో ఉందంటూ ఎదురుదాడికి దిగారు. జైరామ్‌ రమేశ్‌ సైతం బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లైంది.

విఫలమైన పోలీసులు…

పోలీసులు సమక్షంలోనే మూక హత్యలు జరగడంతో యావత్తు దేశం విస్తుపోయింది. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బొత్తిగా వెన్నుపూస లేకుండా….పిరికితనంతో వ్యవహరించారనే కామెంట్లు నెటిజనం నుంచి వస్తున్నాయి. దీనిపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ శివసేన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంది. అయితే పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్‌లో మహా రాజకీయం బీజేపీ–మహా అఘడీ(శివసేన–కాంగ్రెస్‌–ఎన్‌సీపీ)ల మధ్య మహారంజుగా సాగేలా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి