iDreamPost

పాక్ మిల‌ట‌రీకి మేడిన్ చైనా క‌ష్టాలు

పాక్ మిల‌ట‌రీకి మేడిన్ చైనా క‌ష్టాలు

భార‌త్ ను ఎలా ధీటుగా ఎదుర్కోవాలి? పాకిస్తాన్ త‌న మిత్రుడు చైనా నుంచి మేడిన్ చైనా యుద్ధ‌నౌక‌ల‌ను కొనుగోలుచేసింది. భార‌త‌భూభాగంమీద‌నే దాడిచేసే యుద్ధ‌విమానాలుకావాల‌ని, జేఎఫ్-17 ఫైట‌ర్ జెట్స్ ను కొనుగోలు చేసింది. రేటు కాస్త త‌క్కువ‌. లోన్ ఇస్తుంది. ఉన్న‌ప్పుడు అప్పుతీర్చుకోవ‌చ్చు. ఇలా భార‌త్ ముందు త‌లెత్త‌డానికి కావ‌ల్సిన యుద్ధ‌నౌక‌లు, యుద్ధ‌విమానాలు త‌మ ద‌గ్గ‌రున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చున‌ని ఆశ‌ప‌డింది పాకిస్తాన్. కాని 2009 జులైలో స‌ముద్ర‌జ‌లాల్లోకి అడుగుపెట్టిన చైనీస్ ఫ్రిగేట్స్( F-22P)తో పాకిస్తాన్ కు పీడ‌క‌ల‌లొస్తున్నాయి. అరేబియా, హిందూ మ‌హాస‌ముద్రాల్లో ప‌హారాకు ఈ యుద్ధ‌నౌక‌ల‌ను వినియోగిస్తోంది పాక్.

ఈ నాలుగు ఫ్రిగేట్స్ లో మూడింటిని చైనా షిప్‌బిల్డింగ్ ట్రేడింగ్ కంపెనీ త‌యారుచేసి, పాక్ కు అందించింది. నాలుగోదాన్ని చైనా కంపెనీ సాంకేతిక బదిలీ ఒప్పందం ప్రకారం, కరాచీ షిప్‌యార్డ్ లో నిర్మించారు. ఈ మేర‌కు 750మిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. 2009 నుంచి 2013 మ‌ధ్య ఈ నాలుగు యుద్ధ‌నౌక‌లు పాక్ కు అందాయి.

పాకిస్తాన్ సమస్యలు
పాక్ నావీకి ర‌క్ష‌ణ‌, పెట్రోలింగ్, ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) సంర‌క్ష‌ణ‌ , అవ‌స‌ర‌మైన‌ప్పుడు దాడుల‌కు సిద్ధంగా ఉండ‌టంకోసం ఈ నాలుగు యుద్ధ‌నౌక‌ల‌ను వినియోగిస్తోంది పాక్. మొద‌ట్లో బాగానే ఉంది. ఆ త‌ర్వాత నుంచి స‌మ‌స్య‌లు మొద‌లైయ్యాయి. ఫ్రిగేట్స్ లోని మిస్సైల్ ను ప్ర‌యోగించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. FM90 (N) క్షిపణి వ్యవస్థ ఆన్‌బోర్డ్ ఇమేజింగ్ లో స‌మ‌స్య‌లున్నాయి. శ‌త్రువు క‌ళ్ల‌ముందున్నా, యుద్ధ‌నౌక‌లు, విమానాల మీద‌ టార్గెట్ ను లాక్ చేయ‌లేక‌పోతున్నారు. దీనికితోడు అరేబియా స‌ముద్రంలో షిప్ లు స్పీడుగా క‌ద‌ల‌డంలేదు. ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌స్తుందేమోన‌ని పాక్ నావీ అధికారుల హ‌డ‌లిపోతున్నారు. నావీ యుద్ధ‌విన్యాసాల్లో ఈ సంగ‌తి బైట‌డింది.

ఈ నౌకల‌కు ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్ (IR17) వ్యవస్థ, SR 60 రాడార్ అమర్చబడి ఉన్నాయి. శ‌త్రురాక‌ను ప‌సిగ‌ట్టే ఈ రాడార్లు కీల‌కం. ఇప్పుడు వాటితోనే స‌మ‌స్య‌. దీనికితోడు మేడిన్ చైనా యుద్ధ‌నౌక‌ల్లో ఇంజ‌న్ చాలా తొంద‌ర‌గా హీటెక్కిపోతోంది.

ఇదే తొలిసారా?
మేడిన్ చైనా ఆయుధ‌వ్య‌వ‌స్థ‌ల‌తో పాక్ ఇబ్బంది ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కాదు. ఈ ఫిబ్ర‌వ‌రిలో చైనా త‌యారీ విటి4 మెయిన్ బాటిల్ ట్యాంక్ ల త‌యారీలో క్వాలిటీ లేక‌పోవ‌డంతో ఇబ్బందిప‌డుతోంది. చైనా నుంచి దిగుమ‌తి చేసుకున్న‌ 203ఎంఎం గ‌న్ తోనూ పాక్ అధికారులు కిందామీదాప‌డుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి