iDreamPost

అధికారుల నిర్లక్ష్యం… ఏపీలో 27 వేల కరోనా నమూనాలు వృథా

అధికారుల నిర్లక్ష్యం… ఏపీలో 27 వేల కరోనా నమూనాలు వృథా

కరోనా వైరస్‌ కట్టడిలో అధికారుల నిర్లక్ష్యం భారీ నష్టానికి దారి తీసింది. భారీ సంఖ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల కరోన పరీక్ష నమూనాలు వృథా అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను సిబ్బంది సరైన విధంగా భద్రపరచకపోవడంతో నష్టం వాటిల్లింది. సాంపిల్స్‌ తీసిన సిబ్బంది వాటికి సరిగా మూతలు పెట్టకపోవడం, శాంపిల్స్‌పై నంబర్‌ వేయకపోవడం వల్ల 27వేల నమూనాలు తీసి కూడా ఫలితం లేకుండా పోయింది.

ఏ శాంపిల్‌ ఎవరిదో తెలియకపోవడంతో వాటన్నింటిని పక్కన పెట్టేశారు. శాంపిల్‌ తీసిన వారి వివరాలు కూడా పూర్తి స్థాయిలో కోవిడ్‌ యాప్‌లో నమోదు చేయలేదని జిల్లా కలెక్టర్‌ గుర్తించారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల స్థాయి అధికారులపై కలెక్టర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులకు కూడా ఎలా పని చేయాలో శిక్షణ ఇవ్వాల్సి వస్తోందని మండిపడ్డారు. మళ్లీ 27 వేల మంది నుంచి నమూనాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

27 వేల నమూనాలు వృథా కావడంతో వాటిని ఇచ్చిన వారిలో ఆందోళన నెలకొంది. కరోనా వచ్చిన వారిని కలిసిన వారు, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువలు.. రాజకీయ నేతలు ఇలా.. అనేక వర్గాల వారి శాంపిల్స్‌ ఈ 27 వేల మందిలో ఉన్నాయి. ఫలితాలు తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్న వారికి అధికారులు పిడుగు లాంటి వార్త చెప్పారు. మళ్లీ నమూనాలు సేకరించడం, వాటి ఫలితాల వెల్లడికి ఎంత సమయం పడుతుందోనన్న ఆందోళనలో కరోనా అనుమానిత బాధితులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి