iDreamPost

ఆరోపణల్లో అర్థం ఉండాలి నిమ్మల..?

ఆరోపణల్లో అర్థం ఉండాలి నిమ్మల..?

గడిచిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే గెలుచుకోవడం వల్ల ఆ పార్టీ లోని కొంత మంది ఎమ్మెల్యేలకు బాగా ఉపయోగపడుతుంది. గెలిచిన ఎమ్మెల్యేల లో కొంతమందిలో నెలకొన్న స్తబ్దత, భవిష్యత్తుపై ఆందోళన ముఖ్యంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వంటి వారు పార్టీలో ఎదిగేందుకు మంచి అవకాశంగా మలుచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో తమ పేరు మార్మోగిపోవడానికి, అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి వారి వద్ద ఉన్న ఒకే ఒక అస్త్రం అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం పై, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయడం. ఈ విషయంలో ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉన్నారు.

ఎమ్మెల్యేగా, టిడిపి ఉపాధ్యక్షుడు గా ఉన్న నిమ్మల రామానాయుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పై పోరాటం చేస్తూనే మరో పక్క ప్రజా సంక్షేమం, వారి రక్షణ కోసం పాటుపడుతోంది. గరిష్టంగా పరీక్షలు చేసి వైరస్ లింక్ ను కట్ చేయడం ద్వారానే ఆ మహమ్మారిని నిరోధించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగానే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షకుపైగా కరోనా పరీక్షలు చేసింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పరీక్షలు చేస్తే అందులో లక్ష పరీక్షలో ఒక ఏపీ లోనే చేయడం గమనార్హం.

ఏపీ కృషిని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కొనియాడుతున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ నేతలే పరీక్షలు చేయించుకొని లక్ష పరీక్షలు చేసినట్లుగా చెబుతున్నారు.. అంటూ నిమ్మల రామానాయుడు అర్థం పర్థం లేని విమర్శ చేశారు. వైసీపీ నేతలే పదేపదే పరీక్షలు చేయించుకుంటే రాష్ట్రంలో ప్రతి రోజు కొత్తగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయో నిమ్మల రామానాయుడు చెప్పాలి. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడుతున్న రామానాయుడు, మరోవైపు కరోనా పరీక్షలు చేయడంలేదంటూ మాట్లాడం హాస్యాస్పదంగా ఉంది.

ఏపీ ప్రభుత్వం అవినీతి కే ప్రాధాన్యత ఇస్తోంది. రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో 30 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.. ఇది రామానాయుడు చేసిన మరో ప్రధాన ఆరోపణ. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ వికెట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాటి మొత్తం విలువ 7.30 కోట్లు మాత్రమే. అలాంటప్పుడు 30 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ..? ఎలా..? జరిగిందో రామానాయుడు సెలవు ఇవ్వాలి. నరం లేని నాలుక మాట్లాడేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయం రామానాయుడు గుర్తుంచుకోవాలి.

నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా.. పేద ప్రజలను ఆదుకోవడం లేదంటూ రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పనిలో పనిగా ఆయన మరో డిమాండ్ చేశారు. పేద ప్రజలకు పదివేల రూపాయలు సహాయం చేయాలి అన్నారు. టిడిపి ప్రభుత్వం దిగి పోతున్న సమయంలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయన్న విషయం రామానాయుడుకు తెలియంది కాదు. ఈ విషయం వారి అనుకూల ప్రతికూల లోనే ప్రముఖంగా ప్రచురించారు. ఇక చంద్రబాబు హయాంలో ఐదేళ్ల కాలంలోనే రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. దిగిపోయే సమయంలో 60వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులు పెండింగ్ లో పెట్టారు. ఆ బిల్లును క్రమక్రమంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చెల్లిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ 1800 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. ఇవన్నీ నిమ్మల రామానాయుడు తెలియకనే విమర్శలు చేస్తున్నారా..? ఇక పేద ప్రజలకు కరోనా ఆపత్కాలంలో వెయ్యి రూపాయల నగదుతో పాటు ప్రతి మనిషికి 12 కేజీల చొప్పున బియ్యం, ప్రతి రేషన్ కార్డుకి కేజీ పప్పు ప్రభుత్వం అందజేసింది. అదే సమయంలో పింఛన్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి ప్రజలు ప్రభుత్వం అందించే పథకాలు ఫలితాలను పొందుతున్నారు. కాబట్టి రామానాయుడు విమర్శలు చేసే ముందు ఆలోచించుకుంటే ఆయన ప్రజా జీవితానికి మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి