ఎవరు గెలిచినా లేకున్నా, పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తాను మాత్రం గెలుస్తానని బీరాలు పలికిన పశ్చిమగోదావరి జిల్లా టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ కోటలు ఆయన కళ్లెదుటే కూలిపోతున్నాయి. తన ప్రాబల్యమున్న గ్రామాలకు గ్రామాలు అధికార పార్టీ వైపు వెళ్ళిపోతుండటంతో ఎం చేయాలో తెలియక వైరాగ్యంలోకి వెళ్లిపోతున్నారు.
దెబ్బ మాములుగా లేదు!
రెండుసార్లు దెందులూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన చింతమనేని ప్రభాకర్ కు జిల్లా కేంద్రం ఏలూరు ఆనుకుని ఉండే పెదవేగి, దెందులూరు మండలాల్లో మంచి పట్టు ఉండేది. కొన్ని గ్రామాలకు గ్రామాలు టీడీపీ వైపు రావడంలో చింతమనేని తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లారు. గతంలో కేవలం పెదపాడు మండలంలో మాత్రమే కాస్త వెనుకబాటు కనిపించేది. ఆ మండల స్వరూపం భిన్నంగా ఉండడం, దెందులూరు నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉండడంతో అక్కడ చింతమనేని ప్రాబల్యం కనిపించేది కాదు. అయితే 2019 లో మొదటిసారి ఓటమి రుచి చూసిన చింతమనేని కీ ఇప్పుడు నియోజకవర్గం మొత్తం మీద ఎదురుగాలి వీస్తోంది. ఆయనకు గతంలో బ్రహ్మరథం పట్టిన గ్రామాల్లో సైతం అధికార పార్టీ వైపు మళ్లుతున్నాయి.
85కు 68 గ్రామాల్లో పాగా!
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో అధికార పార్టీ తన సత్తా చూపింది. నాలుగో విడత లో జరిగిన ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో మొత్తం 85 పంచాయతీలు ఉంటే, దానిలో అధికార పార్టీ 68 కైవసం చేసుకోవడం విశేషం. కొన్నిచోట్ల వైసిపి రెబల్స్ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 12 గ్రామాల్లోనే టిడిపి గెలవ గలిగింది. గత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన చోట్ల టీడీపీ పత్తా లేకుండా పోయింది.
సొంత గ్రామంలో కాస్తలో…
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం దుగ్గిరాల లో టిడిపి చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా గెలిచింది. ఇక్కడ టిడిపి అభ్యర్థి కేవలం 66 ఓట్ల తేడాతో గెలిచారు. వైస్సార్సీపీ తరఫున ప్రభావం చూపగల రెబల్ అభ్యర్థి ఉండటంతో అధికార పార్టీ ఓట్లను భారీగా చీల్చారు. వైసీపీ అభ్యర్థికి, రెబల్ అభ్యర్థి కి వచ్చిన ఓట్లలో సగం కూడా టీడీపీ అభ్యర్థి కీ రాలేదు. ఇక దుగ్గిరాల పంచాయతీలోని 12 వార్డుల్లో 7 అధికార పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. దీంతో సొంత గ్రామంలోనూ ఎదురయిన ప్రతికూల వాతావరణంతో చింతమనేనికి ఎం చేయాలో పలుపోక సతమతమవుతున్నారు.
కొఠారు ప్రత్యేక వ్యూహం!
నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పూర్తి కసరత్తు చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తిగా సంక్షేమ పథకాల అమలులో ముందుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని గ్రామాలను చుడుతూ, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామీణుల మన్ననలు అందుకున్నారు. ఇక పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికను వేసుకుంటున్నారు.
ఏ గ్రామంలో పార్టీ పరిస్థితి వెనుకబడి ఉంది అనేది తెలుసుకుని ఆయా గ్రామాల పై ప్రత్యేక దృష్టిని నిలపడంతో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ చింతమనేని ఇలాకా మొత్తం అధికార పార్టీ హస్తగతం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు పార్టీ నేతలను కలుపుతూ సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం ఏలూరు ఆనుకుని ఉండే దెందులూరు నియోజకవర్గం విషయాలను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అబ్బాయి చౌదరి కి తగిన సూచనలు అందిస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ పరిషత్ ఎన్నికలే. మరో వైపు ఈ ధాటి తట్టుకునేందుకు చింతమనేని మనాన్ని ఆశ్రయిస్తున్నారు.