iDreamPost
android-app
ios-app

కొడాలి నానికి ఊరట.. నిమ్మగడ్డకు వరుస షాక్‌లు

కొడాలి నానికి ఊరట.. నిమ్మగడ్డకు వరుస షాక్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మీడియాతో మాట్లాడకూడదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మంత్రి నానిపై విధించిన ఆంక్షలను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్‌ను కించపరిచేలా మంత్రి కొడాలి నాని మాట్లాడారని పేర్కొంటూ.. ఆయనపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆంక్షలు విధించారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం కొడాలి నాని న్యాయవాది వాదనతో ఏకీభవించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వరకే ఎస్‌ఈసీకి అధికారాలు ఉంటాయని, ప్రజా ప్రతినిధులు మీడియాతో మాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించే అధికారంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మాట్లాడడం వాక్‌ స్వాతంత్ర హక్కు అని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఎస్‌ఈసీ మంత్రిపై విధించిన ఆంక్షలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రజా ప్రతినిధులపై ఈ తరహా ఆంక్షలు విధించడం ఇదేమీ కొత్త కాదు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ముగ్గురు ప్రజా ప్రతినిధులపై మీడియాతో మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. మొదట మంత్రి పెద్దిరెడ్డి, తర్వాత ఎమ్మెల్యే జోగి రమేష్‌లపై ఆంక్షలు విధించగా.. వాటిని కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తన ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధమని ఏపీ హైకోర్టు కొట్టివేస్తున్నా.. పట్టని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మూడో సారి మంత్రి నానిపై కూడా అదే తరహా ఆంక్షలు విధించారు. ప్రతి సారి ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు షాక్‌లు తగులుతున్నా.. ఆయన తీరు మాత్రం మారడం లేదు.

మంత్రి కొడాలి నానిపై ఆంక్షలు విధించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తన న్యాయవాది ద్వారా పంపిన వివరణపై సంతృప్తి చెందని ఎస్‌ఈసీ మంత్రి నానిపై కేసు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. తన హక్కులకు భంగం కలిగే ఎస్‌ఈసీ వ్యవహరించారంటూ మంత్రి కొడాలి నాని అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును విచారించాలని ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయిచడంతో నిమ్మగడ్డకు చిక్కులు తప్పేలా లేవు. ఇక మంత్రి కొడాలి నాని కూడా ఫిర్యాదు చేస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన్ను ఈ వివాదాలు వెంటాడే పరిస్థితులు నెలకొన్నాయి.