మోసం చేయటానికి కాదు.. కుటుంబాన్ని పెంచటానికి మహిళ వేషం వేసాడు కూటి కోసం కోటి విద్యలు అనే నానుడి ఈ సంఘటనకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. బ్రతుకుదెరువు కోసం సొంత ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సంపాదన కోసం ఏకంగా చీర కట్టాడు. మధురైలోని శివగంగై జిల్లాకి చెందిన మానామదురైలో రాజా అనే వ్యక్తి గత కొన్నినెలలుగా చీర కట్టుకుని మహిళ వేషంలో ఇంటిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రాజా నివసించేది శివగంగై జిల్లాలో కానీ అక్కడి నుంచి రాజర్ రోడ్డు తెప్పకుళం అనే ప్రాంతానికి వెళ్లి పని చేస్తుంటాడు. సొంత జిల్లాలో లుంగీ, ప్యాంటు, షర్డుతో తిరిగే రాజా తెప్పకుళంలో మాత్రం ఆడ వేషంలో కనిపిస్తుంటాడు.
అక్కడ మూడు ఇళ్లల్లో రాజా పనిచేస్తూ తన పేరును రాజాత్తిగా మార్చుకున్నాడు. అనుకోని విధంగా రాజా బట్టలు మార్చుకుంటున్న ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరడంతో రాజాను విచారణ జరిపారు.
మానామదురైలో ఏ పని దొరకకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను పెంచుకోవడం కోసం మహిళగా అవతారం ఎత్తాల్సి వచ్చిందంటూ రాజా తన బాధలను చెప్పుకున్నాడు.