పిల్లలకు, వాళ్లను మరీ ప్రేమించే పేరెంట్స్ కు ఈ స్టడీ అస్సలు నచ్చదు. కాని ఇంటిపని చేసే పిల్లల్లో బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుందని లా ట్రోబ్ యూనివర్సిటీ (La Trobe University ) అధ్యయనం చెబుతోంది. వంట చేయడం, అంట్లుతోమడంలో అమ్మకు సాయం చేయడం, చెత్త ఊడ్చడంతోపాటు ఇంట్లో అన్ని పనులు చేసే పిల్లలు, అటు చదువులోనూ ఇటు తమ సమస్యలను తాము పరిష్కరించుకోవడంలోనూ, చురుగ్గా ఉంటారు.
మొదట్లో చెబితే మొండికేయొచ్చు. అల్లరి చేయవచ్చు. కాని ఇంటిపనులు చేస్తే మంచదని నచ్చజెప్పి, వాళ్లను కనుక మీతోపాటు పనిచేయిస్తే, చాలా పాజిటీవ్ రిజల్ట్స్ ఉన్నాయంటున్నారు. సొంతంగా బతకడం వస్తుంది. పదిమందిలో కలిసే తత్త్వం, జీవితంలో సంతోషం… ఇవన్నీ వస్తాయంటున్నారు పరిశోధకులు. అంతేనా? ఇలా వయస్సు పెరుగుతున్న కొద్దీ తగిన ఇంటిపనిచేస్తే, వాళ్లకు సమస్యలను పరిష్కరించుకొనే శక్తికూడా పెరుగుతుంది. అందుకే పరిశోధకలు, మరికొంతకాలం అధ్యయనం చేసి, ఇంటిని గెలిచే వాళ్లు, సమాజంలో కూడా ఎదుగుతారా? ఆ ప్రభావం ఎంతమేర ఉంటుందో తేల్చేపనిలో పడ్డారు.
బుడిబుడి నడక వయస్సు నుంచే చిన్నచిన్న పనులు చెప్పడం చేయాలి. వయస్సును బట్టి వాళ్లు కొత్తపనులు చేయాలి. పదేళ్లు వచ్చేసరికి స్వతంత్రంగా బతకడం అంటే, వంట చేయడం, బెడ్ సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం వంటి పనులు నేర్చుకోవాలంట. ఇలా ఎదిగిన వాళ్లకు సంస్థలను నడిపే శక్తి ఎక్కువగా ఉంటుందన్నది మరో అధ్యయనం మాట. అసలు ఇంట్లో పనులు చేయడానికి, మేథోపరంగా ఎదగడానికి మధ్య సంబంధాన్ని పూర్తిగా కనిపెట్టడానికి మరికొన్ని అధ్యయనాలు మొదలైయ్యాయి.