ఆక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2-0 ఆదిక్యత సంపాదించింది.133 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదన మొదలుపెట్టిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (6 బంతుల్లో 8 పరుగులు) రెండు బౌండరీలు కొట్టి జోరు మీద ఉన్నట్లు కనిపించిన తొలి ఓవర్లోనే సౌతి బౌలింగులో అవుట్ అయి నిరాశపరిచాడు.
విరాట్ కోహ్లీ(12) కూడా సౌదీ బౌలింగ్ లో అవుట్ అవ్వడంతో 38 పరుగులకే భారత్ కీలకమైన ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లను పవర్ ప్లే లోనే కోల్పోయింది.
మరోసారి బ్యాటింగ్ లో ఆకట్టుకున్నా రాహుల్,అయ్యర్:
కీలక దశలో ఒత్తిడిని అధిగమిస్తూ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని రాహుల్, శ్రేయస్ అయ్యర్ భారత ను విజయ బాటలో నడిపారు. ఈ క్రమంలో రాహుల్-శ్రేయస్ జంట మూడో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3*4,2*6)వరుసగా రెండోసారి అర్థ సెంచరీ సాధించగా,విజయానికి 8 పరుగులు అవసరమైన సమయంలో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ (33 బంతుల్లో 44;1*4, 3*6) వెనుదిరిగాడు.తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శివమ్ దూబే (8 నాటౌట్) సౌదీ వేసిన 18 ఓవర్ మూడో బంతిని సిక్సర్ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
బెంబేలెత్తించిన భారత బౌలర్లు:
తొలి టీ-20లో రాణించిన కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్(33) పవర్ ప్లే ఆఖరి బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ దిశలో భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్ తో జట్టు స్కోరు 48 పరుగుల వద్ద అవుటయ్యాడు.మరో ఓపెనర్ మున్రో(26) శివం దూబే బౌలింగులో రన్ రేట్ ను పెంచుటకు కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన అద్భుత డ్రైవింగ్ క్యాచ్ తో పెవిలియన్ బాట పట్టాడు.
కీలక వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచిన జడ్డూ:
జడేజా వేసిన ఫ్లైట్ డెలివరీ డిఫెన్స్ ఆడబోయిన గ్రాండ్ హోమ్ ఇచ్చిన సులువైన రిటర్న్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు.గత టి-20లో తన బ్యాటింగ్ శైలికి విరుద్ధంగా దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14) జడ్డూ ఊరిస్తూ వేసిన బంతిని షార్ట్ కొట్టగా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాలిలో పైకి లేచిన బంతిని చాహల్ ఒడిసి పట్టగా అవుటయ్యాడు.భారత స్పిన్నర్ జడేజా తన వరస ఓవర్లలో కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి కివీస్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.
బంతి బ్యాట్ కు తగిలించడానికి అవస్థ పడ్డ కివీస్ బ్యాట్స్ మెన్:
భారత బౌలర్లు సంధించిన బంతులు బ్యాట్ కు తగిలించడానికి ఇబ్బంది పెట్టడంతో న్యూజిలాండ్ వంద పరుగులు పూర్తి చేయడానికి 15.3 ఓవర్లు పట్టింది.అనంతరం రాస్ టేలర్, టిమ్ సీఫెర్ట్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో కివీస్ బ్యాట్స్ మెన్లు పరుగుల కోసం శ్రమపడ్డారు.స్లాగ్ ఓవర్లలో స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రాస్ టేలర్ (18) అవుట్ అవ్వగా, టిమ్ సీఫెర్ట్ 26 బంతులలో 33 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో అజేయంగా నిలిచాడు.
మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో(26), టిమ్ సిఫర్ట్ (33) మినహా మిగితా బ్యాట్స్ మెన్ పరుగులు సాధించడంలో విఫలమవడంతో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది.భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టగా, శివం దూబే, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ తలొక్క వికెట్ పడగొట్టారు. మహమ్మద్ షమీ వికెట్లు పడగొట్టనప్పటికీ గుడ్ లెన్త్, షార్ట్ పిచ్,యార్కర్ లతో అద్భుతంగా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్”అవార్డు దక్కించుకున్నాడు.మూడో టి20 మ్యాచ్ బుధవారం హామిల్టన్‌లో జరగబోతుంది.