ప్రజాస్వామ్యంలో రెండు ప్రధాన వ్యవస్థలు విలువలు కోల్పోయి, రోజురోజుకీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రధాన వ్యవస్థల్లో మొదటిది రాజకీయం రెండోది జర్నలిజం. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు వాడుతున్న భాష దిగజారిపోతున్న విలువలకు నిలువుటద్దం పడుతోంది. అలాగే ఆ దిగజారుడుతనాన్ని నిస్సిగ్గుగా ప్రజలకు చేరవేస్తున్న జర్నలిజం కూడా మరింత దిగజారి కనిపిస్తోంది.
కొందరు నేతల తిట్టటమే పెట్టుబడిగా ఎదగాలని చూస్తుంటారు.అలాగే మీడియా కూడా అంతే స్థాయిలో బురద పూసుకుని కనిపిస్తోంది. కొంత మంది రాజకీయ నాయకులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో చూస్తే, వింటే సాధారణ జనాలు కూడా సిగ్గుతో నవ్వుతున్నారు.
ఓ రెండు మూడు దశాబ్దాల క్రితం రాజకీయనాయకులు హుందాగా ఉండేవారు. ప్రత్యర్థులపై విమర్శలు కూడా అర్ధవంతంగా ఉండేవి. సోషలిజం కోరుకునే కమ్యూనిస్టులు, సెక్యులరిజం వైపు నిలిచిన కాంగ్రెస్ పార్టీలు, వాటితో పాటు జాతీయవాదంతో రాజకీయాలు చేసే జనసంఘ్ (ఆ తర్వాత కాలంలో బీజేపీ) నేతలు రాజకీయాలు చేస్తున్న రోజుల్లో ప్రత్యర్థులపై విమర్శల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండేవారు. సబ్జెక్టు పైనే విమర్శలు ఉండేవి. వ్యక్తిగత విమర్శలు ఉండేవి కావు. ఒక విధానం పట్ల విమర్శలో ఐడియాలజీ ప్రధాన భూమిక పోషించేది.
1980 దశకం నుండి ఓ పార్టీ నేత ఇంకో పార్టీ నేతపై చేసే విమర్శలు కొంత దురుసుగా, కాస్త దుందుడుకుగా ఉండేవి. ప్రత్యర్థులను విమర్శించే పరిస్థితి నుండి ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే దశకు రాజకీయం చేరుకుంది. ఈ దశలోనే ప్రత్యర్ధులు సవాళ్ళు, ప్రతిసవాళ్ళు విసురుకోవడం మొదలయింది. అయితే ఈ దశలో జర్నలిజం చాలా అప్రమత్తంగా ఉండేది. సవాళ్ళు, ప్రతిసవాళ్ళు క్రమంలో ఏ రాజకీయ నాయకుడైనా కొన్ని పరుషమైన పదాలు వాడితే, మీడియా వాటిని తొలగించేది. అప్పటికి ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా రాకపోవడం వల్ల, ప్రింట్ మీడియా (పత్రికలు) రాజకీయనాయకుల సవాళ్ళు, ప్రతిసవాళ్ళలో పరుషపడాలను తొలగించే పరిస్థితి ఉండేది.
Also Read : సీఎం జగన్పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఈ దశ 1990 దశకంలో కాస్త శృతి మించింది. రాజకీయ ప్రత్యర్ధులు సవాళ్ళు, ప్రతిసవాళ్ళ క్రమంలో బ్యాలన్స్ కోల్పోయిన సందర్భాలు కూడా వచ్చాయి. ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణల స్థాయినుండి ప్రత్యర్థులపై అక్షర దాడి, ప్రతిదాడి మొదలయింది. ఈ దాడి క్రమంలోనే రాజకీయ నాయకుల పదజాలం కాస్త పరుషంగా ఉండేది. ఈ దశలోనే పత్రికలు “పరుష పదజాలం వాడారు” అనో “అభ్యంతరకర పదజాలం వాడారు” అనో రాసేవి తప్ప సదరు నాయకులు ఏ పదాలు వాడారు అనేది చెప్పేవి కాదు. ఆంగ్ల పత్రికలు కూడా “unparliamentary language” అనో “objectionable language” అనో ప్రస్తావించేవారు తప్ప సదరు నేతలు వాడిన పదాలు పాఠకుల నెత్తిన రుద్దేవి కావు.
అయితే 2000 దశకం రాజకీయాలకు, జర్నలిజానికి ఓ దురదృష్ట దశాబ్దం అనుకోవాలి. అటు రాజకీయాలు, ఇటు జర్నలిజం పతనం ఇక్కడే మొదలయింది. ఈ దశకంలోనే ఎలక్ట్రానిక్ మీడియా కాస్త వేగంగా “విప్లవాత్మకంగా” ముందుకు వచ్చింది. అప్పటివరకు “లైవ్” లేవు. అందువల్ల న్యూస్ బులెటిన్లలో నేతలు వాడిన అభ్యంతరకర పదాలను ఎడిట్ చేసి ప్రసారం చేసే ఎలెక్ట్రానిక్ మీడియా (న్యూస్ చానళ్ళు) ఈ దశకంలోనే “లైవ్” ప్రసారాలు మొదలు పెట్టాయి. ఈ లైవ్ ప్రసారాల్లో ఎడిట్ చేసే సౌలభ్యం లేకపోవడంతో నేతలు వాడే అభ్యంతరకర పదజాలం యధాతధంగా ప్రసారం అయ్యేది. మరీ దురదృష్టం ఏమంటే ఏ నేత అయితే అభ్యంతరకర పదాలు ఘాటుగా వాడతారో ఆ నేతను పదేపదే చూపించడం, ఆ పదాల భాగాన్ని కొంత ప్రత్యేకంగా చూపించడం న్యూస్ చానళ్ళు మొదలు పెట్టాయి. దురదృష్టం ఏమంటే ఈ నోటిదూల దురుసు పదాలను, బూతులను ప్రసారం చేసిన టీవీలకు రేటింగ్ పెరిగింది. ఫలితంగా అలాంటి నేతలకు న్యూస్ చానెళ్ళలో ప్రాధాన్యత కూడా పెరిగింది.
ఇక 2010 దశకం, ఇప్పటి 2020 దశకం ఆ పతన స్థాయిని మరింతగా దిగజార్చుతోంది. మొత్తంగా కొందరు రాజకీయనాయకులు, కొన్ని మీడియా సంస్థలు ఈ బూతుల రోతపైనే ఆధారపడి మనుగడ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఇంతకు మించి దిగజారేందుకు ఇప్పటివరకూ ఇంకో స్థాయి అంటూ ఏదీ లేనందువల్ల ఈ దిగజారుడు ఇలానే ఉంటుందని అనుకోవాల్సిందే. కాకపోతే గత మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు, జర్నలిజం చూస్తున్న కొందరు రాజకీయ నాయకులూ, జర్నలిస్టులు, పాఠకులకు ఇది మింగుడుపడని పరిస్థితి. కొంత ఏహ్య భావం కూడా కలిగించే పతనం ఇది. సగటు మనిషి సిగ్గుతో తలదించుకోవాల్సిన పతనం ఇది.
Also Read : అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!