టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన చాలా మంది పార్టీ కార్యకర్తలను నిరాశ పరిచింది. మళ్లీ పాత పంథానే అవలంబించినట్లు కనిపించింది. పంచాయతీ ఎన్నికల్లో పరాభవంతో అందరితోనూ మాట్లాడతారని భావించిన కొంత మందికి నిరాశే మిగిలింది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తప్పకుండా అందరితోనూ సంప్రదింపులు జరుపుతారని స్థానిక నేతలు ఊహించారు. కానీ తాను ఎప్పుడూ నమ్మిన టీమ్ తోనే చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. యథావిధిగా ఆ కోటరీకి చెందిన నేతల సమాచారం ప్రాతిపదికనే సమావేశంలో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
40 ఏళ్లుగా కింది స్థాయి కేడర్ తో సంప్రదింపులు జరిపే అలవాటు లేని బాబు ఇప్పుడైనా మారతారని ఎదురుచూసిన కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. మూకుమ్మడి ప్రసంగంలో మాత్రం అందరికీ అండగా ఉంటానని చెప్పడం మినహా.. కుప్పంలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయలేదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాది తర్వాత కుప్పం రావడానికి కారణం పంచాయతీ ఎన్నికల ఫలితాలే. గతంలో ఎప్పుడు వచ్చినా ఆయన కాన్వాయ్ లో నియోజకవర్గమంతా పర్యటించి కొద్ది మంది నేతలతో మాత్రం సంప్రదింపులు జరిపి వెళ్లిపోయేవారు. ఈసారి ఆయన గ్రామాల్లో పర్యటించ లేదు. నియోజకవర్గ ప్రజలను పలకరించలేదు. పార్టీ కార్యకర్తలతో సమావేశానికే పరిమితం అయ్యారు. అక్కడ కూడా కొంత మంది సెలెక్టడ్ కేండిడేట్లతోనే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
పంచాయతీ ఎన్నికల్లో పరాభవం తర్వాత నిజంగా పార్టీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా స్థానికంగా వైసీపీ నేతలుగా ఎవరెవరు ఉన్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే అంశాలను తెలుసుకోవడానికే ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన కుప్పం వచ్చినపుడు మండల పార్టీ సమావేశాలు చాలాసార్లే నిర్వహించారు. అయితే కార్యకర్తలు మాట్లాడడానికి వీలులేకుండా ఎంపిక చేసిన నాయకులు, అధినేత ప్రసంగాలతోనే ఆ సమావేశాలు ముగిసిపోయాయి. ఈసారి కూడా అలా జరగదని అంతా భావించారు. గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడి వారి వేదనను, క్షేత్రస్థాయిలో నేతల తీరుతో వారు ఎదుర్కొంటున్న బాధలను వినాలని అందరూ కోరుకున్నారు. కానీ తొలిరోజు అలా జరగలేదు.
చంద్రబాబు ఇక్కడికొచ్చినా, ఇక్కడినుంచి శ్రేణులు అమరావతి లేదా హైదరాబాదే వెళ్లినా ఆయన చుట్టూ ఒక కోటరీ పోగు పడి ఉంటుంది. దాన్నే కోర్ కమిటీ అని అని పిలుచుకుంటారు. వివిధ పార్టీ పదవుల్లో ఉన్న, రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న లేదా అనుభవించి మాజీలుగా మారిన నేతలు 25మంది ఈ కోటరీలో సభ్యులు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఈ కమిటీతో గంటల తరబడి సమావేశమవుతారు. వారు చెప్పిన మాటలనే చెవికెక్కించుకుంటారు. కార్యకర్తలు ఆ గెస్‌హౌస్ వెలుపలే బ్యారికేడ్లకీవల ఉండిపోతారు. గ్రామ పర్యటనలు చేసినప్పుడు అక్కడక్కడా ఆగి చంద్రబాబు ఉపన్యాసాలిస్తారు. మధ్యలో ఏ గ్రామస్థుడు లేదా కార్యకర్త అడ్డుపడి ఏదైనా సమస్య ప్రస్తావించబోతే.. అంతా తనకు తెలుసనే రీతిలో తలూపి ఏదో ఒక మాట మాట్లాడి అంతటితో అయిందనిపిస్తారు. కోర్ కమిటీ సభ్యుల తీయనైన మాటలు ఆలకించి అంతా బాగుందని చంద్రబాబు భ్రమపడతారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
మంగళవారం జరిగిన టీడీపీ సమావేశంలో- ఆ కోర్ కమిటీలో సభ్యుడైన ఓ నేత.. ‘అధికారంలో ఉన్నపుడు మనమే వర్కులు చేశాం. కమీషన్లు తిన్నాం. ఆ తిన్న దాంట్లోంచి ఒక్కొక్కరు ఏ కొద్దిమొత్తమో పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకోసం ఖర్చు పెట్టి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘోర పరాజయం తప్పేది’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇంతగా భ్రష్టు పట్టిన కోర్ కమిటీ వ్యవస్థను ప్రక్షాళన దిశగా ఆలోచించకుండా చంద్రబాబు మళ్లీ వారికే ప్రయారిటీ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.