iDreamPost

టీవీ 5 ఆఫీసుపై దాడిలో మరో కోణం

టీవీ 5 ఆఫీసుపై దాడిలో మరో కోణం

తెలుగు న్యూస్ చానెళ్ల తీరు రానురాను రాజకీయ పార్టీలను మించిపోతోంది. పార్టీ నాయకుల తరహాలో న్యూస్ యాంకర్లు, అధినేతల మాదిరిగా ఆయా సంస్థల యజమానులు వ్యవహరిస్తున్నారనే విమర్శ నిజమేననిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని చానెళ్లు వ్యవహరిస్తున్నాయి. కొన్నిసార్లు హద్దు మీరి వ్యవహరిస్తున్నాయి. అలాంటి ధోరణికి కొనసాగింపుగానే అన్నట్టుగా ఓ చిన్న ఘటనను భూతద్దంలో చూపించి, సానుభూతి పొందాలనే ప్రయత్నాలకు కూడా దిగుతున్నాయి. సహజంగా రాజకీయాల్లో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకూ అందరి నేతలూ అదే తరహాలో ఉంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వినియోగించుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తుంటారు. ఇప్పుడు అది మీడియా చానెళ్లకు విస్తరించడం పెద్ద విశేషం లేదు. ఎప్పుడయితే పార్టీలు, న్యూస్ రూమ్ లు మమేకం కావడం పెరిగిందో అప్పటి నుంచే ఇది విస్తరించింది.

తాజాగా టీవీ 5 వ్యవహారం గమనిస్తే ఓ ఆసక్తికర అంశం బయటపడుతుంది. ఇప్పటి వరకూ ఏ మీడియా సంస్థ మీద దాడి జరిగినా ప్రభుత్వాలు స్పందించడం గమనిస్తూ ఉంటాం. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయా ప్రభుత్వాలు మీడియా విషయంలో ప్రచారం కోసమే అయినా మాట్లాడుతూ ఉంటాయి. అలాంటిది టీవీ5 మీద దాడి అంటూ సాగించిన రాద్ధాంతం విషయంలో అటు తెలంగాణా ప్రభుత్వం గానీ, ఇటు ఏపీ ప్రభుత్వం గానీ స్పందించలేదు. కనీసం విచారణ జరిపిస్తామని కూడా ప్రకటించలేదు,ఖండించడానికి కూడా పదే పదే ఒత్తిడి చేసిన తర్వాత గానీ చాలామంది ముందుకు రాలేదనే వాదన కూడా ఉంది. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ వంటి వాళ్లు మాత్రం ట్విట్టర్ లో ఖండనలు సాగించారు.

వాస్తవానికి ఓ టీవీ చానెల్ మీద దాడి చేయడం వెనుక కారణాలు ఏముంటాయనే అనుమానం కూడా ఉంటుంది. ఇటీవల కరోనా సందర్భంగా అలాంటి దాడికి పూనుకునేటంతటి రాజకీయ పరిణామాలు కూడా లేవు. ఒకవేళ రాజకీయంగా దాడికి పూనుకుంటే కేవలం సెక్యూరిటీ వద్ద చిన్న క్యాబిన్ అద్దం మీద రాయి వేసి పోతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అదే సమయంలో ఇటీవల టీవీ 5 నుంచి తొలగించిన సిబ్బందిలో ఎవరైనా ఆక్రోశంతో పూనుకుని ఉండకపోతారా అనే వారు కూడా ఉన్నారు. మొన్నటి మే 1 వ తేదీన టీవీ5 తన సిబ్బందిలో కొందరిని సాగనంపింది. అలాంటి వారిలో ఎవరైనా ఆగ్రహంతో ఇలాంటి చర్యకు పూనుకుని ఉండవచ్చనే భావన కూడా వినిపిస్తోంది.

సాధారణంగా రాజకీయకక్షతో దాడికి పూనుకుంటే కొంత ఉద్రికత్త తలపించేలా చేస్తారని, ఇలాంటి ఆకతాయి వ్యవహారాలకు రాజకీయాలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టీవీ 5 మీద దాడి అంటూ ఎంతగా మొత్తుకున్నా జనం నుంచి స్పందన రాలేదనే అబిప్రాయం కూడా ఉంది. చిన్న ఘటనకు రాజకీయ రంగులు అద్దాలనే ప్రయత్నం బెడిసికొట్టిందనే వారు కూడా ఉన్నారు. ఏమయినా పార్టీల నేతలకు , మీడియా ప్రతినిధులకు పెద్ద వైరుధ్యం ఉండదనే విషయం మరోసారి రూఢీ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి