iDreamPost

ఈతరం బ్యాట్స్‌మెన్‌లలో నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ: అమీర్

ఈతరం బ్యాట్స్‌మెన్‌లలో నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ: అమీర్

సాధారణంగా మైదానాలలో ఎక్కువ సమయం గడిపే క్రికెటర్లు కరోనా వైరస్ కారణంగా ఆయా దేశాలలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.కానీ సోషల్ మీడియాలో ఇతర ఆటగాళ్లతో అభిమానులతో ముచ్చడిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నా పాక్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటాడు.తాజాగా సోషల్ మీడియాలో అమీర్‌ని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరని ఒక అభిమాని ప్రశ్నించాడు.

పాక్ బౌలర్ అమీర్ సమాధానం చెబుతూ ” మా దేశానికి చెందిన సయీద్ అన్వర్ మొత్తం మీద నా అభిమాన బ్యాట్స్‌మెన్ కాగా, ప్రస్తుత క్రికెటర్‌లలో మాత్రం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ తరం క్రికెటర్‌లలో కోహ్లీనే ఉత్తమ బ్యాట్స్‌మెన్. అతనికి పోటీనిచ్చే బ్యాట్స్‌మెన్ ప్రస్తుత ఆటగాళ్లలో ఎవరూ లేరు’’ అని మెచ్చుకున్నాడు. అయితే దాయాది పాక్ జట్టుకు చెందిన ఒక క్రికెటర్ భారత సారథి విరాట్ కోహ్లీని తన ఫేవరెట్ బ్యాట్స్‌మన్‌గా పేర్కొనటం విశేషం.

అప్పట్లో 2010 ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన మహ్మద్ అమీర్‌పై ఐదేళ్లు నిషేధం పడింది.దీంతో అతని క్రికెట్ కెరీర్ ముగిసిపోయినట్లేనని అందరు భావించారు. కానీ 2016 ఆసియా కప్‌తో అతను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు.ఈ కప్‌లో నాలుగు టీ-20 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీసుకొని తిరిగి ఘనంగా కెరీర్ ప్రారంభించాడు.2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత కీలక బ్యాట్స్‌మన్‌లైన రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టిన మహ్మద్ అమీర్ ట్రోఫీని భారత్ జట్టుకు దూరం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

36 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అమీర్‌ 30.47 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. అయితే గత జూలై,2019లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.జట్టు ప్రయోజనాల పట్టించుకోకుండా 28 ఏళ్ల వయసులోనే రిటైర్డ్ కావడంపై పాక్ మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం పాక్ వన్డే,టీ20 జట్టులో అగ్రశ్రేణి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి