iDreamPost

చిన్న సినిమా కొత్త ప్రయత్నం.. ఫ్రీగా 100 షోలు.. ఆ తర్వాతే థియేటర్లోకి..

చిన్న సినిమా కొత్త ప్రయత్నం.. ఫ్రీగా 100 షోలు.. ఆ తర్వాతే థియేటర్లోకి..

ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం చాలా కష్టమైపోయింది. కరోనా వల్ల వాయిదా పడ్డ పెద్ద సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలకి థియేటర్లు కూడా ఎవరూ ఇవ్వట్లేదు. ఈ సమస్య ఎప్పట్నుంచో ఉంది. ఇక ఓటీటీలో కూడా చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ ఇలాంటివన్నీ తట్టుకొని చిన్న సినిమా రిలీజ్ చేసినా ఎవరు చూస్తారో తెలీదు, వాటికి పెట్టిన డబ్బులు కూడా వస్తాయన్న గ్యారెంటీ లేదు.

ఇలాంటి కష్టాలకి చెక్ పెట్టేందుకు దీనికి ఒక కొత్త పరిష్కారం ఆలోచించారు ఓ దర్శక నిర్మాత. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ అంటూ గులాబీ సినిమాలో మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్ ఇటీవల దర్శకుడిగా మారాడు. గతంలో పలు సినిమాలకి మ్యూజిక్ అందించిన ఆయన ఆ తర్వాత ఎన్నో యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు డైరెక్ట్ చేశారు. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు. తాజగా ఆయన ‘Life of 3’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం ఈయనే కావడం విశేషం.

కోటి రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ప్రస్తుతం చిన్న సినిమాలకి గడ్డు కాలం నడుస్తుండటంతో ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు శశి ప్రీతమ్. టూరింగ్ టాకీస్ కార్నివాల్ అనే ఆలోచనతో ఈ సినిమాని ముందుగా ఏపీ, తెలంగాణలోని పలు నగరాల్లో 100 ఫ్రీ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా దాదాపు ఓ పదివేల మందికి ఈ సినిమాని ఫ్రీగా చూపించి వారి ద్వారా సినిమా బాగుంది అని టాక్ బయటకి వెళ్ళాక అప్పుడు థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తామని తెలిపారు.

అయితే ఈ సినిమాని ఇలా 100 షోలు ఫ్రీగా ప్రేక్షకులకి చూపించడానికి హాల్ లేదా థియేటర్ లాంటి ఖర్చులు ఉంటాయి. అందుకని ఇందులో కార్పొరేట్ ప్రమోషన్స్ ని భాగమయ్యేలా చేశారు. ఈ సినిమాని ప్రదర్శించే చోట పలు కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సినిమాని ఫ్రీగా చూపించనున్నారు. దీంతో సినిమాని ప్రేక్షకులకి ఫ్రీగా చూపించవచ్చు, అలాగే కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ గా ప్రేక్షకుల వద్దకే వెళ్లొచ్చు, సినిమాకి కూడా ప్రమోషన్ అవుతుంది.

ఇలాంటి ఓ కొత్త ఆలోచనతో వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్ ఈ సినిమాని ఇప్పటికే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో, ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రేక్షకులకి ఫ్రీ షోలు వేశారు. ఈ షోలతో దాదాపు 1000 మంది వరకు ఈ సినిమా రీచ్ అయింది. ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, హారర్ అంశాలతో ఉన్న ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. దాదాపు అందరూ కొత్తవారితోనే ఈ సినిమాని తెరకెక్కించారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ నగరాల్లో ఈ సినిమాని ఫ్రీగా ప్రేక్షకులకి ప్రదర్శించనున్నారు. చిన్న సినిమాని ఇలా కొత్తగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం అని శశి ప్రీతమ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి