iDreamPost

Box Office Disasters : కంటెంట్ లేని చిత్రాలకు బాక్సాఫీస్ తీర్పు

Box Office Disasters : కంటెంట్ లేని చిత్రాలకు బాక్సాఫీస్ తీర్పు

మెప్పించే సినిమాలే కాదు ప్రేక్షకులను కంటెంట్ తో భయపెట్టేవి కూడా వస్తూ ఉంటాయి. రిలీజ్ కు ముందు వరకు విపరీతమైన హైప్ తీసుకురావడం, తీరా మొదటి రోజు పరిగెత్తుకుంటూ థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ కి నీరసం తెప్పించడం ఎప్పుడూ ఉండే వ్యవహారమే. 2021 కూడా దానికి మినహాయింపుగా నిలవలేదు. డిస్ట్రిబ్యూటర్లకు పీడకలలుగా నిలిచినవి లేకపోలేదు. అవేంటో ఓ లుక్ వేద్దాం. బాహుబలి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న రానా హీరోగా వచ్చిన ‘అరణ్య’ ఏ ఒక్క వర్గాన్ని మెప్పించలేకపోయింది. అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారి రెండో రోజే డెఫిసిట్ లోకి వెళ్లడం బ్యాడ్ లక్. ఏళ్ళ తరబడి ల్యాబులో మగ్గిపోయిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’లో ముతక మాస్ చూసి బెంబేలెత్తిన జనం రెండో వారం తిరక్కుండానే డిజాస్టర్ ముద్ర వేసి పంపించారు.

డెబ్యూతో బ్లాక్ బస్టర్ అందుకుని మూడేళ్లు ఒకే కథ మీద పని చేసిన దర్శకుడు అజయ్ భూపతి ‘మహా సముద్రం’ లాంటి అవుట్ ఫుట్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇద్దరు హీరోలు వృథా కాగా ఏ ఒక్క అంశం కనీస స్థాయిలో లేకపోయింది. కామెడీ చిత్రాలతో మెప్పించే జి నాగేశ్వరరెడ్డి తీసిన ‘గల్లీ రౌడీ’ మరీ సిల్లీగా ఉండటంతో మూడు కోట్లు కూడా రాబట్టలేక తోక ముడిచింది. హాస్యంతో బ్రాండ్ ఏర్పరుచుకున్న మారుతీ ‘మంచి రోజులు వచ్చాయి’తో నిరాశపరిస్తే తన బ్రాండ్ మీద మార్కెటింగ్ చేయించిన పూరి కొడుకు ‘రొమాంటిక్’ కూడా తుస్సుమంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ఓటిటిలో వచ్చినా సేఫ్ అయ్యేది కానీ థియేటర్లలోకి వచ్చి రెవిన్యూ పోగొట్టుకుంది. రాజేంద్రప్రసాద్-శ్రీ విష్ణుల కాంబోని నమ్ముకుని ‘గాలి సంపత్’ పూర్తి సినిమా చూడకుండా లేచి వచ్చిన ప్రేక్షకులు ఎందరో.

ఇక ‘అల్లుడు అదుర్స్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పబ్లిక్ ని మరీ తీసికట్టుగా అంచనా వేసి సంక్రాంతికి ఏది చూపించినా చెల్లుతుందనే భ్రమలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన ఈ సాహసం టీవీలో చూసేందుకు కూడా బోలెడు ధైర్యం కావాలి. మంచి కాన్సెప్ట్ ఉన్నా ప్రెజెంటేషన్ సరిగా లేక తేడా కొట్టినవాటిలో స్కై ల్యాబ్, అనుభవించు రాజా, సీటిమార్, రంగ్ దే, శ్రీదేవి సోడా సెంటర్, శ్రీకారం లను చెప్పుకోవచ్చు. ఉత్తి ప్రచార ఆర్భాటాలకు పరిమితమైన మంచు విష్ణు ‘మోసగాళ్లు’ రెండో రోజుకే కరిగిపోయింది. అల్లరి నరేష్ తన పాత స్కూల్ కి వెళ్లి ట్రై చేసిన ‘బంగారు బుల్లోడు’కి టైటిల్ వేస్ట్ అవ్వడం తప్ప కలిగిన ప్రయోజనం శూన్యం. కొండపొలం, వరుడు కావలెను లాంటివి ప్రీ రిలీజ్ పాజిటివ్ వైబ్రేషన్లను నిలబెట్టుకోలేకపోయాయి

Also Read : OTT Platforms : భవిష్యత్తుపై ఆశలు పెంచేసిన ఓటిటి ట్రెండ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి