iDreamPost

దటీజ్‌.. చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

దటీజ్‌.. చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. రాజకీయల్లో ప్రజా నాయకుడిగా పని చేస్తున్న చేవిరెడ్డి.. దాతృత్వంలో సహచర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటున్నారు. పండగ సమయంలోనూ, కష్టకాలంలోనూ తానున్నానంటూ ముందుకు వచ్చే చేవిరెడ్డి.. ప్రస్తుత కరోనా సమయంలోనూ ప్రజలకు ఎంతో భరోసా ఇస్తున్నారు.

కరోనా రోగులకు పరామర్శ..

తన నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి మాస్క్‌లు, సానిటైజర్, విటమిన్‌ టాబ్లెట్లు, పౌష్టికాహార కిట్లు అందించిన చేవిరెడ్డి.. తాజాగా కరోనా రోగులను నేరుగా కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం, తాను ఉన్నాంటూ భరోసా ఇచ్చారు. తిరుపతిలోని స్విమ్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిని సందర్శించిన చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.. పీపీఈ కిట్‌ ధరించి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 330 మందిని స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించడంలో ఏమైనా లోపాలు ఉన్నా సరి చేస్తామని హామీ ఇచ్చారు. వైరస్‌ వల్ల ఏమీ కాదని, వేగంగానే కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు.

చేవిరెడ్డే స్ఫూర్తి..

కరోనా రోగులను పరామర్శించిన మొదటి ఎమ్మెల్యే చేవిరెడ్డే కావడం గమనార్హం. లాక్‌డౌన్‌ సమయంలోనూ నియోజకవర్గ ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు, వైరస్‌ రక్షణ కిట్లు.. అందించే కార్యక్రమం రాష్ట్రంలోనే మొదట చేవిరెడ్డి తన నియోజకవర్గం చంద్రగిరిలో ప్రారంభించారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఆయన బాటలో నడిచారు. ఇప్పుడు కరోనా బాధితులను కలసి ధైర్యం చెప్పిన మొదటి ఎమ్మెల్యేగా చేవిరెడ్డే నిలిచారు. అంతకు ముందు వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని కోవిడ్‌ బాధితులు పరామర్శించి తన బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం చేవిరెడ్డి చూపిన చొరవ.. కోవిడ్‌ బాధితుల్లో ధైర్యం నింపింది. చేవిరెడ్డి స్ఫూర్తితో ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితులను పరామర్శించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి