iDreamPost

మెగాస్టార్ మాస్ మహారాజ్ కలవబోతున్నారా

మెగాస్టార్ మాస్ మహారాజ్ కలవబోతున్నారా

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల సంసృతి ఎన్టీఆర్ హయాం తర్వాత చిరంజీవి శకం మొదలైనప్పటి నుంచి బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో రెగ్యులర్ గా వస్తుంటాయి కానీ తెలుగులో మాత్రం చాలా అరుదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో వెంకటేష్ మహేష్ బాబు దీనికి శ్రీకారం చుట్టాక ఒక్కొక్కరుగా వీటికి ఓకే చెప్పడం మొదలుపెట్టారు. అలా అని పదుల సంఖ్యలో బహుళ తారల సినిమాలు రాలేదు కానీ ఆర్ఆర్ఆర్ మొదలయ్యాక కదలిక వేగంగా ఉంటోంది. అందులో భాగంగానే భీమ్లా నాయక్, మహాసముద్రం లాంటి ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడో లేటెస్ట్ అప్ డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందబోయే సినిమాలో రవితేజ ఉంటాడని దాని సారాంశం. చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో పాటు స్క్రీన్ స్పేస్ మెగాస్టార్ తో సమానంగా ఉంటుందట. అందుకే బాబీ రవితేజ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చేలా చేసుకోగలిగారని ఇన్ సైడ్ టాక్. ఈ ఇద్దరు గతంలో అన్నయ్యలో నటించారు. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. అంటే 21 ఏళ్ళు దాటింది. అప్పుడు రవితేజకు స్టార్ ఇమేజ్ లేదు. ఇడియట్ నుంచి వచ్చింది. శంకర్ దాదా జిందాబాద్ లోనూ రవితేజ ఒక పాటలో జస్ట్ అలా తళుక్కున కనిపించి మాయమవుతాడు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం చూపించే మాస్ మహారాజా ఇప్పుడు నిజంగా ఓకే చెప్పాడా లేదా తెలియాలి.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన చిరంజీవి ఇంకా ఆచార్యలో చిన్న సీన్లు కొన్ని పూర్తి చేయాల్సి ఉందట. మరోవైపు మెహర్ రమేష్ భోళా శంకర్ తాలూకు పనులను వేగవంతం చేశాడు. వీటి సంగతి అలా ఉంచితే బాబీ ఇటీవలే ఫుల్ స్క్రిప్ట్ తో చిరంజీవితో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారని, భోళా శంకర్ ని వెనక్కు తోసి దీన్ని ముందుకు తెచ్చేలా ఆలోచన చేస్తున్నారని మెగా కంపౌండ్ టాక్. అయితే దీనికి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ఒకవేళ నిజంగా చిరంజీవి రవితేజ కలిసి స్క్రీన్ ని పంచుకుంటే అంతకన్నా ఇద్దరి ఫ్యాన్స్ కు కావాల్సింది ఏముంటుంది. దీనికి ఇంకా హీరోయిన్ లాక్ కాలేదు.

Also Read : రిలీజ్ డేట్ ని జక్కన్న డిసైడ్ అయ్యారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి