iDreamPost

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్- కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించిన మమతా

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్- కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించిన  మమతా

కరోనా వైరస్‌ ప్రభావంపై రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి,లాక్‌డౌన్ అమలు చేస్తున్న తీరు గురించి చర్చిస్తున్నారు.అయితే ఇవాళ్టి ఐదవ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. బెంగాల్ సీఎం దీదీ మాట్లాడుతూ కరోనా అంశంపై కేంద్రం రాజకీయాలు చేస్తుందని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రం ఒక పథకం ప్రకారం పని చేస్తుందని కూడా ఆమె విమర్శించారు.

ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదు. తమ అభిప్రాయాలని ఎవరూ అడగరని,దేశంలోని దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయొద్దని బెంగాల్ సీఎం కోరినట్లు తెలుస్తోంది. బెంగాల్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దులతోపాటు దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకోవడంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కొన్ని సవాళ్లు తమ ప్రభుత్వానికి ఎదురవుతున్నట్లు తెలిపారు.

గత ఏప్రిల్ లో బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘన, కరోనా వైరస్ కేసులను తక్కువ చేసి నివేదిస్తున్నట్లు ఆరోపిస్తూ కేంద్ర బృందం ఆ రాష్ట్రాన్ని సందర్శించింది. ఆనాటి నుంచి బెంగాల్ సీఎం బెనర్జీ,కేంద్రం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తమ రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం సందర్శనపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి ఆగ్రహంతో లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌ను తమ ప్రభుత్వం సమర్థంగానే నియంత్రిస్తుందని ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దని ఆమె కోరారు.చివరగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి,వలస కార్మికుల సమస్య,లాక్‌డౌన్‌ దశలవారీగా తొలగించడం గురించి చర్చించాలని సమావేశంలో పాల్గొంటున్న మిగిలిన సీఎంలకు ఆమె సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి