iDreamPost

‘చేతులు’ కలుపుదాం రండి..!

‘చేతులు’ కలుపుదాం రండి..!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన విపక్షాలు భవిష్యత్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయా, కాంగ్రెసేతర కూటమికి బదులు కాంగ్రెస్‌ సహా కూటమికి శ్రీకారం చుట్టనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘‘యూపీఏ మనుగడలేదు. కాంగ్రెస్‌ విఫలమైంది’’ అంటూ బెంగాల్‌ మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సూచన ప్రాయంగా అంగీకరించారు. కాంగ్రెస్‌ కోరుకుంటే ఆపార్టీతో ‘కూటమి’ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

‘‘కాంగ్రెస్‌ అంగీకరిస్తే 2024 సార్వత్రికల ఎన్నికల్లో మేం కలిసి పోటీ చేయొచ్చు. ఇప్పుడు దూకుడు ప్రదర్శించడం దండగ. పాజిటివ్‌గా ఉండాలి. ఈ విజయం (నాలుగు రాష్ట్రాల్లో) బీజేపీకి పెద్ద నష్టం జరగనుంది’’ అని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ విశ్వసనీయతను కోల్పోతోంది. ఆ పార్టీపై ఆధారపడలేం. కాంగ్రెస్‌ కోసం ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేదు’’ అని అమె అభిప్రాయపడ్డారు. ‘‘సంస్థాగత నిర్మాణం ద్వారా కాంగ్రెస్‌ గతంలో దేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగింది. అయితే ఇప్పుడు ఆపార్టీ నేతలకు ఆసక్తి సన్నగిల్లింది. ఇప్పుడు ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసేందుకు తప్పకుండా ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే’’ అని మమత పేర్కొన్నారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌ సహా మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాలపై మమత అనుమానాలను వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు.. ప్రజా తీర్పును ప్రతిఫలింపచేయలేదని వ్యాఖానించారు. ఎన్నికల యంత్రాంగం, కేంద్ర బలగాలు, ఇతర ఏజెన్సీల సాయంతోనే బీజేపీకి విజయం లభించిందని ఆమె ఆరోపించారు. అఖిలేశ్‌ యాదవ్‌ను ఓడించేలా చేశారేకాని, ప్రజా తీర్పుతో ఆయన ఓటమిపాలుకాలేదని భావిస్తున్నానని చెప్పారు. జరిగినదానికి అఖిలేశ్‌ కుంగిపోకుండా జనంలోకి వెళ్లి.. ఈవీఎంల బాగోతాలను వివరించాలని ఆమె సూచించారు. ఓటర్లు వినియోగించినవాటినే కౌంటింగ్‌ కేంద్రాలకు తీసుకువెళ్లారా? లేదా? అని తేలాలంటే అన్ని ఈవీఎంలకూ ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించాల్సిందేనని మమత డిమాండ్‌ చేశారు.

కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహకర్తి ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్రంగా స్పందించారు. గురువారంనాటి అసెంబ్లీ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవని ఆయన స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం జరిగిన బీజేపీ విజయోత్సవ సభలో మాట్లాడిన ప్రధానిమోదీ.. 2022 ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే (శుక్రవారం) ప్రశాంత్‌ కిశోర్‌ ఈమేరకు ట్వీట్‌ చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు 2024లో జరుగుతాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో (2022) సంబంధంలేకుండా అప్పటి ఫలితం అప్పుడే వెలువడుతుంది. సాహెబ్‌ (ప్రధాని మోదీని ఉద్దేశించి)కు ఈ విషయం తెలుసు. అయితే తాజా ఫలితాలను లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టి విపక్షాలను ఆందోళనకు గురిచేసి వాటిపై మానసికంగా పైచేయి సాధించే తెలివైన ప్రయత్నమిది. ఆ ఉచ్చులో పడొద్దు’’ అనిట్వీట్‌లో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి