iDreamPost

అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన

అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన

తహసీల్దార్‌ను దూషించిన కేసులో పరారిలో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూర రవికుమర్‌ ఈ రోజు ప్రత్యక్షమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందుగుల పోలీసులకు కూన రవికుమర్‌ లొంగిపోయారు. కేసు నమోదైనప్పటి నుంచి గత నాలుగు రోజులుగా పరారిలో ఉన్న ఆయన బుధవారం పొందుగుల పోలీస్‌ స్టేషన్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు. కూన రవికుమార్‌ స్టేషన్‌కు వచ్చే ముందుగానే తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా ఉన్నారు. ఆయన స్టేషన్‌కు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

గతంలోనూ ప్రభుత్వ అధికారులను దూషించిన వ్యవహారంలో కూన రవికుమార్‌పై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇసుక వ్యవహారంలో కూన రవికుమార్‌ పొందుగుల తహసీల్దార్‌ రామకృష్ణను దుర్భాషలాడారని కేసు నమోదైంది. తనను ఫోన్‌లో దూషించారని స్వయంగా రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూనను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన వెళ్లిపోయారు.

ఈ నెల 16వ తేదీన గొరింట గ్రామంలోని రామసాగరం వద్ద ఇసుక తవ్వుతున్న రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లను తహసీల్దార్‌ రామకృష్ణ సీజ్‌ చేశారు. దాంతో కూన రవికుమార్‌ తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి విడిచిపెట్టాలని కోరినట్లు సమాచారం. అయితే తహసీల్దార్‌ వినకపోవడంతో బెదరించినట్లు ఆరోపణలున్నాయి. విడిచిపెట్టకపోతే.. లంచం డిమాండ్‌ చేశావని ఫిర్యాదు చేస్తానని రవికుమార్‌ బెదిరించినట్లు, దుర్భాషలాడినట్లు రామకృష్ణ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి