iDreamPost

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న కియా…

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న కియా…

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ “కియా”కంపెనీ భారత మార్కెట్లో దూసుకుపోతుంది. కియా మోటార్స్ ఇండియా భారతదేశంలో అడుగుపెట్టిన రెండునెలల్లోనే అత్యధిక కార్లను అమ్మిన మూడో అతిపెద్ద సంస్థగా రికార్డులకెక్కింది. అంచనాలను మించిన అమ్మకాలు జరగడంతో కియా మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది.

కియా మోటార్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం కిందటి నెలలో మొత్తం 15,644 కార్ల అమ్మకాలు జరిగాయి. వాటిలో సెల్టోస్ మోడల్ కార్లు అమ్మకాలు 14024 కాగా, కార్నివాల్ మోడల్ కార్ల అమ్మకాలు 1620 జరిగాయి. ఇప్పటికే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు భావిస్తున్నామని కియా మోటార్స్ ఇండియా పేర్కొంది. ఇండియాలో ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనంతపురం ప్లాంట్‌ను విస్తరించడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

గతంలో రాయిటర్స్ కథనం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకు కియా ప్లాంట్ తరలిపోతుందంటూ అసత్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అసత్య ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అడుగుపెట్టిన రెండు నెలల్లోనే దేశంలో మూడో పెద్ద కార్ల కంపెనీగా ఎదిగిన కియా అనంతపురం పెనుకొండ సమీపంలో నిర్మించిన కార్ల తయారీ యూనిట్‌ను మరింత విస్తరించడానికి కసరత్తులు చేస్తోంది.కార్ల అమ్మకాలు మందకొడిగా ఉన్న స్థితిలో కూడా అంచనాలకు మించిన బుకింగ్స్ మరియు అమ్మకాలు జరుగుతుండటంతో కియా మోటార్స్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో తమ ప్లాంట్ ని మరింత విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి