iDreamPost

పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇల్లు రాయించేసుకున్నకార్యకర్తను సస్పెండ్ చేసిన జనసేన

పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇల్లు రాయించేసుకున్నకార్యకర్తను  సస్పెండ్ చేసిన జనసేన

జనసేన కార్యకర్తల వ్యవహారాలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఇప్పటికే వివిధ నేరాలతో ఆపార్టీ కార్యకర్తల అనుబంధం బయటపడింది. తాజాగా నేరుగా పార్టీ అధినేత పేరు చెప్పి ఓ వృద్ధురాలి ఇంటిని తమ పేరుతో మార్చేసుకున్న తీరు ఆసక్తిగా మారింది. విజయవాడలో జరిగిన ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవడం చర్చనీయాంశం అయ్యింది. విజయవాడ పాయకాపురంలోని సుందరయ్య కాలనీకి చెందిన దోనెపూడి లక్ష్మి ఇంటిని తన పేరుతో మార్చుకున్న జనసేన కార్యకర్త పై ఫిర్యాదు రావడంతో పోలీసుల దర్యాప్తు ప్రారంభమయ్యింది.

భర్త మరణం తర్వాత పిల్లలు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండడంతో లక్ష్మి ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె ఇంట్లో అద్దెకి దిగిన జనసేన పార్టీ కార్యర్త బొప్పన శ్యామ్ సన్ ఆమెకు ఎరవేశారు. పవన్ కళ్యాణ్ ఓ కొత్త పథకం ప్రవేశపెట్టారని ఆశపెట్టారు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళలకు పార్టీ తరుపున భారీ నజారానా ఇస్తున్నట్టు ప్రకటించారు. నెలకు రూ.10వేల చొప్పున ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. అది లక్ష్మికి కూడా మంజూరయ్యిందంటూ కొన్ని పత్రాలు తీసుకుని వచ్చి వాటి పై సంతకాలు తీసుకున్నారు.

తీరా ఆరునెలలు గడిచిన తర్వాత ఆమె ఇంటిని తన ఇల్లుగా మార్చుకున్న శ్యామ్ సన్ దాని స్వాధీనం కోసం ప్రయత్నం చేయడంతో బాధితురాలు లబోదిబోమనడం మొదలయ్యింది. పైగా 70 గజాల స్థలంలో ఉన్న ఆ ఇంటిని మరొకరికి బేరం పెట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో బాధితురాలు పోలీసులన ఆశ్రయించారు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జనసేన పార్టీ కార్యకర్తగా ఉండి, పవన్ కళ్యాణ్‌ పేరు చెప్పి పెన్షన్ ఆశ చూపించి ఇల్లు లాగేసుకునే ప్రయత్నం చేసిన తీరు మాత్రం విస్మయకరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఇదో చర్చనీయాంశం అవుతోంది.

ఈ పరిస్థితుల్లో జనసేన నేతలు కూడా స్పందించారు. శ్యాంసన్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విచారణలో ఉన్న సమయంలో నిందితుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పేరుతో జరిగిన మోసం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడంతో ఆ పార్టీ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి