iDreamPost

దేశంలోనే తొలిసారి.. కర్నూలు జిల్లాలో బంగారం శుద్ది పరిశ్రమ

  • Published Sep 03, 2023 | 11:33 AMUpdated Sep 03, 2023 | 11:33 AM
  • Published Sep 03, 2023 | 11:33 AMUpdated Sep 03, 2023 | 11:33 AM
దేశంలోనే తొలిసారి.. కర్నూలు జిల్లాలో బంగారం శుద్ది పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా రికార్డు సృష్టించింది. దేశంలోని తొలి బంగారం శుద్ధి పరిశ్రమను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఈ బంగారం శుద్ది పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.200 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దేశంలోనే మొదటిసారి ఓ ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో బంగారం తవ్వకాలు జరగనున్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–­బొల్ల­వానిపల్లి మధ్య గోల్డ్‌ మైనింగ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ చైర్మన్‌ చార్లెస్‌ డెవినిష్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హనుమప్రసాద్‌ శనివారం భూమిపూజ చేశారు.

రోజుకు 1500 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ బంగారం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభం కాగా.. 1945లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో రాయచూర్‌‌లో హట్టి మైన్స్ ప్రారంభమైంది. మళ్లీ ఇప్పటి వరకూ మన దేశంలో బంగారం తవ్వకాలు జరగలేదు. ఇక స్వాతంత్య్రం వచ్చాక మన దేశంలో బంగారం తవ్వకాలు చేపడుతున్న తొలి సంస్థగా జియో మైసూర్ నిలిచింది. ఏడాదిలోగా ఈ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా జియో మైసూర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే 100 మందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ సంస్థ.. ప్లాంట్ ప్రారంభమయ్యాక మరో 200 మందికి ఉపాధి అవకాశం కల్పించినుంది.

తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు.. ఇండియన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ.. 1994లోనే గుర్తించింది. అనంతపురం జిల్లా రామగిరిలోనూ బంగారు నిక్షేపాలను గుర్తించారు. ఇక భారత ప్రభుత్వం.. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించిన తర్వాత.. 2005లోనే జియో మోసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. ఇక 2013లో బంగారం వెలికితీతకు సంబంధించి జియో సంస్థకు అనుమతులొచ్చాయి. బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆ సంస్థ.. మరో 1500 ఎకరాలను లీజ్‌కు తీసుకుంది.

భూమిని లీజ్‌కు ఇచ్చిన రైతులకు జియో సంస్థ.. ప్రతి ఏడాది కౌలు చెల్లిస్తోంది. ఇక బంగారం తవ్వకాల కోసం ఈ సంస్థ ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక చోట చొప్పున సుమారు 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు తగ్గట్టే రావడంతో.. ఈ సంస్థ పూర్తి స్థాయిలో మైనింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి