iDreamPost

కాలేజీ కబంధహస్తాలకు కత్తెర.. అమ్మకు బాధ్యత..

కాలేజీ కబంధహస్తాలకు కత్తెర.. అమ్మకు బాధ్యత..

దాదాపు పదేళ్ల తర్వాత ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు అందరికీ ప్రభుత్వం నుంచి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ అందుతోంది. 2007లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కులాలు, మతాలు ప్రస్తావన లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ అందించారు. ఆయన చలువతో రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని యువకులు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ కు రకరకాల ఆంక్షలు విధిస్తూ ఫీజులో కోత విధించాయి. ఉదాహరణకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు 35 వేల నుంచి 1.05 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చని అనుమతించిన ప్రభుత్వం.. విద్యార్థులకు మాత్రం 35 వేల రూపాయలు మాత్రమే నుంచి ఇస్తామని చెప్పాయి. మిగతా ఫీజు చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పోసప్పో చేయడమో లేక ఆస్తులు అమ్ముకోవడమో చేశారు.

అయితే రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి వైఎస్ఆర్ పాలన మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. జగనన్న విద్యా దీవెన పథకం కింద వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు అందించే పథకాన్ని ఈరోజు ప్రారంభించబడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం లో రెండేళ్లపాటు పెండింగ్ లో ఉంచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 18 వందల కోట్లతో పాటు తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సొమ్ములు కలిపి.. మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయనుంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ములను నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకు ఒక సారి ఏడాదిలో నాలుగు దఫాల్లో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇచ్చే సొమ్మును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులను కాలేజీకు చెల్లించడం ద్వారా కాలేజీ యాజమాన్యాలలో జవాబుదారితనం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ములను విద్యార్థుల ఖాతాలకు జమ చేశాయి. అయితే విద్యార్థుల బ్యాంకు ఖాతాలు మొత్తం ప్రైవేటు కాలేజీల గుప్పెట్లో ఉండేవి. విద్యార్థులు కాలేజీలో చేరిన మొదటి ఏడాది లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కోసం అంటూ వారి చేత బ్యాంకు ఖాతాలను ప్రారంభించేవి. ఇప్పటికే ఖాతా ఉన్న కూడా కొత్త ఖాతాను తెరిపించేవి. బ్యాంకు అధికారులను కాలేజీలకే పిలిపించేవారు. విద్యార్థులకు అకౌంట్ ఓపెన్ చేసే వారు. అందుకు సంబంధించిన బ్యాంకు పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులు కాలేజీల చేతుల్లో పెట్టుకునేవి. విద్యార్థులు కాలేజీలో ఉన్న అన్ని ఏళ్ళు ఆ బ్యాంకు పుస్తకం, ఏటీఎం కార్డులు కాలేజీ యాజమాన్యాల చేతుల్లో ఉండేవి. కొన్ని కాలేజీలు విద్యార్థుల వెళ్లే సమయంలో బ్యాంకు పాస్ పుస్తకం ఏటీఎం కార్డులు వారికి ఇస్తుండగా..మరి కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆయా ఖాతాలను క్లోజ్ చేస్తూ ఉండేవి.

ఇకపై విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉన్నత విద్యా శాఖ యంత్రాంగంపై ఉంది. ఎందుకంటే విద్యార్థుల తల్లి పేరిట కూడా బ్యాంకు ఖాతాలను ప్రారంభింపచేసి ఎప్పటిలాగే కాలేజీలు తమ చెప్పుచేతల్లో ఉంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదముంది. ప్రైవేటు కాలేజీలపై నిత్యం నిఘా ఉంచడం వల్ల ఇది సాధ్యమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి