iDreamPost

రష్యా దాడిలో భారత విద్యార్థి మృతి..

రష్యా దాడిలో భారత విద్యార్థి మృతి..

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్ యుద్ధంలో తొలి భారతీయ పౌరుడు మరణించినట్లు భారత ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఉక్రెయిన్ లో మెడిసిన్‌ చదువుతున్న సదరు విద్యార్థి పేరు నవీన్‌కుమార్‌ కాగా కర్ణాటక నుంచి ఉక్రెయిన్ వెళ్లినట్టు గుర్తించారు. ఈ ఉదయం ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేసి ధృవీకరించారు. “ఈ ఉదయం ఖార్కివ్ బాంబు దాడిలో భారతీయ విద్యార్థి మరణించాడని మేము తీవ్ర విచారంతో ధృవీకరిస్తున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. సదరు విద్యార్థి కుటుంబంతో మంత్రిత్వ శాఖ టచ్‌లో ఉందని, ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ట్వీట్ లో పేర్కొన్నారు.

రష్యా మరియు ఉక్రెయిన్ రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి సురక్షితమైన మార్గాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఖార్కివ్‌తో సహా ఇతర నగరాల్లో ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు చిక్కుకుపోయారని తెలుస్తోంది. రష్యా మరియు ఉక్రెయిన్‌లోని భారత రాయబారులు కూడా వారిని కనిపెట్టి వెనక్కు పంపే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌ చేస్తున్న సమయంలోనే ఒక సూపర్ మార్కెట్ బయట రష్యా సైనికుల చేతిలో కాల్చి చంపబడ్డాడు అని చెబుతున్నారు. మీడియాలో ఈ వార్త రాగానే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కుటుంబాలన్నీ టెన్షన్ కు గురవుతున్నాయి.

తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని వారంతా ప్రార్థిస్తున్నారు. ఈ ఉదయం ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ రాజధాని కైవ్‌ను వీలైనంత త్వరగా విడిచిపెట్టాలని కోరింది. కైవ్‌లో పరిస్థితి వేగంగా క్షీణించవచ్చని మరియు భయంకరమైన దాడులు జరగవచ్చని హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే రష్యా జరిపిన వైమానిక దాడుల వీడియోలు కూడా బయటపడ్డాయి. మరో టెన్షన్ పెట్టే వార్త ఏమిటంటే కైవ్ నగరానికి 65 కిలోమీటర్ల పొడవున్న భారీ యుద్ధ కాన్వాయ్ బయలుదేరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి