iDreamPost

ఏయ్ నేను కేంద్ర మంత్రిని..నాకు క్వారంటైన్‌, గీరంటైన్‌లు ఉండవు : కేంద్ర మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు

ఏయ్ నేను కేంద్ర మంత్రిని..నాకు క్వారంటైన్‌,  గీరంటైన్‌లు ఉండవు : కేంద్ర మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు

మంత్రులైతే వారికి కొమ్ములుంటాయా..? నిబంధనలు కేవలం ప్రజలకేనా..? విఐపిలకు..వివిఐపిలకు వర్తించవా..? భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే…కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందికి మినహాయింపు ఉంటుంది..అది ఆ పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించిన వారికి…అంతేతప్ప దారిన పోయిన దానయ్యకు కాదు…కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారైనా నిబంధనలు ‌పాటించాల్సి వస్తుంది. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తే…దాన్ని అరికట్టడానికి నిబంధనలు తయారు చేసిన నేతలే వాటి ఉల్లంఘిస్తే…మరి సాధారణ పౌరడువపరిస్థితేంటీ..? ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు చట్టాలు, నిబంధనలు కేవలం ప్రజలుకేనా..పాలకులకు కాదా అనే మీమాంస కలగకతప్పదు. మన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ చేసిన యవ్వారంపై‌ సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

 ” నేను మంత్రిని నాకు రూల్స్‌ గీల్స్‌ వర్తించవు ” అని కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాయకులు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ప్రధాని మోడీ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన క్యాబినెట్‌ మంత్రులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి బెంగళూరుకు కేంద్రమంత్రి సదానంద గౌడ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. నేరుగా అతని కారు ఎక్కి వెళ్లిపోయారు. కోవిడ్‌-19 కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు చేరుకునే ప్రయాణికులకు తప్పనిసరిగా ప్రభత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలో ఉండాలన్న నిబంధనను కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రి సదానంద గౌడను మాత్రం క్వారంటైన్‌ను తరలించలేదు.

క్వారంటైన్‌ నగర పౌరులకు మాత్రమే అని చెప్పిన సదానంద తనలాంటి కేంద్ర మంత్రులకు కాదని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఒక కేంద్ర మంత్రిగా క్వారంటైన్‌ నుంచి తనకు మినహాయింపు ఉందని చెప్పారు. అంతేకాదు తన ఫోన్‌లో ప్రభుత్వం సూచించిన ఆరోగ్యసేతు యాప్‌ ఉందని ఆ స్టేటస్‌ కూడా గ్రీన్‌ కలర్‌లో చూపుతున్నందున తను క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదని తెలిపారు. కరోనా వైరస్‌ పోరులో ముందువరసలో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచితే దాన్ని ఎలా పారదోలగలుగుతామని సమర్థించుకోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి