iDreamPost

Heropanti 2 హీరోపంటి 2 రిపోర్ట్

Heropanti 2 హీరోపంటి 2 రిపోర్ట్

మనం ఆచార్య హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది అజయ్ దేవగన్ రన్ వే 34, రెండోది హీరోపంటి 2. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో మాస్ లో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరుచుకున్న టైగర్ శ్రోఫ్ ఇందులో హీరో. ట్రైలర్ వగైరా ఇది రొటీన్ గానే ఉంటుందన్న అనుమానాలు రేకెత్తించినప్పటికీ ఇతని ప్రతి మూవీకి ఇలాగే జరుగుతుంది కాబట్టి రెవిన్యూ పరంగా మంచి ఆశలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. పైగా క్యాస్టింగ్ కూడా క్రేజీగా ఉంది. మరీ భారీగా కాకపోయినా అంచనాల విషయంలో ట్రేడ్ అండ్ ఆడియన్స్ ఎదురు చూసిన ఈ హీరోపంటి 2 ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

మనం బోయపాటి వినాయక్ లాంటి దర్శకుల మాస్ విన్యాసాలు చూసి అప్పుడప్పుడు కామెంట్లు చేస్తాం కానీ ఈ హీరోపంటి 2 చూశాక వాళ్ళ మీద అమాంతం గౌరవం పెరుగుతుంది. అంత గొప్పగా ఈ కళాఖండం వచ్చింది. లైలా(నవాజుద్దీన్ సిద్ధిక్)గొప్ప మెజీషియన్. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు తనకు వచ్చేయాలనే ప్లాన్ లో ఉంటాడు. వరల్డ్ వైడ్ మాఫియా ఇతనికి సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఇతన్ని అడ్డుకునే పనిని మన హీరో(టైగర్ శ్రోఫ్)గారు తీసుకుంటారన్న మాట. అక్కడి నుంచి టైగర్ కి విలన్ బ్యాచ్ కి మధ్య జరిగే చిత్ర విచిత్ర విన్యాసాలు తెరమీద చూసి ధన్యోస్మి అనుకోవాలి.

దర్శకుడు అహ్మద్ ఖాన్ బాగా మందు కొట్టేసి తనేం రాస్తున్నాడో అర్థం కానంత మైకంలో ఈ హీరోపంటి 2 స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటారు. లేకపోతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరిదాకా సహనానికి పరీక్ష పెడుతూ గుడ్డలు చించేసుకుని బయటికి పరుగులు పెట్టాలన్నంత చిరాకు పుట్టించడం అంత సులభం కాదు. ఇంతోటి దానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఒకటి. ఆయన మేజిక్ ఎప్పుడో పోయింది కానీ ఇలాంటి ఐరన్ రాడ్ మాస్టర్ పీసులకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో ఊహించుకోవచ్చు. ఎక్స్ ప్రెషన్లే పలకని టైగర్ తో పాటు ఓవర్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన హీరోయిన్ తారా సుతారియాతో పాటు నవాజుద్దీన్ సైతం పిచ్చి యాక్షన్ చేయగలడని చూడాలంటే టికెట్ కొనొచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి