iDreamPost

క్వారంటైన్‌కు 12 మంది వైద్యులు

క్వారంటైన్‌కు 12 మంది వైద్యులు

గుంటూరులోని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్‌లో పని చేస్తున్న 12 మంది వైద్యులను గురువారం క్వారంటైన్‌కు పంపడం జిల్లాలో సంచలనంగా మారింది.కరోనా బాధితులకు వైద్య చికిత్స అందజేసే సమయంలో వారితో సన్నిహితంగా మెలగటంతో స్వీయ దిగ్బంధంలో ఉంచారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీ వైద్యులకు కరోనా సోకినట్టుగా అధికారులు తెలిపారు.మెడికోకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక ప్రైవేటు హోటల్‌ను క్వారంటైన్‌ కేంద్రంగా మార్చి ఇద్దరు బోధనానిపుణులు, పదిమంది మెడికోలను అక్కడికి తరలించారు. వీరందరినీ విడివిడిగా ప్రత్యేక గదులలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

దీంతో రెవెన్యూ అధికారులు ప్రైవేటు హోటల్‌లో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.జ్వరాల వైద్యశాలకు మొదటి నుంచి కరోనా అనుమానిత లక్షణాలతో చాలా ఎక్కువ మంది వచ్చేవారు.అయితే అక్కడి వైద్యులు సామాజిక దూరం పాటించకుండా నర్సులు, వైద్య సిబ్బందితో బృందాలుగా ఏర్పడి చికిత్స అందించినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ క్రమంలో మొదటి విడతలో నలుగురు డాక్టర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చెయ్యగా ముగ్గురికి నెగిటివ్‌,ఒకరికి పాజిటివ్‌ గా తేలింది. రెండో విడతగా నిర్వహించిన మరో ఆరుగురి నిర్ధారణ నివేదికల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.మూడో విడతగా 50 మందికి నిర్వహించిన ఫలితాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు.రాష్ట్రంలోనే తొలిసారిగా వైద్యులను క్వారంటైన్‌కు పంపించడంతో గుంటూరు జిల్లా వాసులలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి