iDreamPost

APలోని ఆ జిల్లాల సరిహద్దుల్లో విలువైన ఖనిజం గుర్తింపు!

APలోని ఆ జిల్లాల సరిహద్దుల్లో విలువైన ఖనిజం గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ ఖనిజాలకు నిలయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకు  విస్తరించిన ఈ రాష్ట్రంలో  వజ్రాలతో సహా ఎన్నో రకాల  ఖనిజాలు లభిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల ఖనిజాలను గుర్తించగా.. తాజాగా అరుదైన ఖనిజం నిల్వల్ని గుర్తించారు.  అనంతపురం, కడప జిల్లాల్లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు జిల్లాల సరిహద్దులో  లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్  ఇండియా  నివేదిక ఇచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లిథియం ఖనిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఖనిజం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనదేశంలో ఈ లిథియం అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. కొద్ది నెలల క్రితమే జమ్మూకశ్మీర్ లో పెద్ద ఎత్తున లిథియం నిల్వను గుర్తించారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ ఖనిజాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏపీలోని  అనంతపురం, కడప జిల్లాల సరిహద్దులో లిథియం నిల్వలు ఉన్నట్లు జీఎస్ఐ నివేదిక ఇచ్చింది.

ఈ రెండు జిల్లాల్లోని లింగాల, తాడిమర్రి, ఎల్లనూరు మండలాల్లో దాదాపు 500 హెక్టార్ల  మేర ఈ నిల్వలు  ఉంటాయని జీఎస్ఐ ప్రాథమికంగా అంచనా వేసింది. పెంచికల బసిరెడ్డి జలాశయ పరిసర ప్రాంతాల్లో ఈ నిల్వలు అధికంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కడప, అనంతపురం జిల్లాలోని ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలో లిథియం నమూనాలను గుర్తించారు. కొన్ని నెలల కిందట జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికను కేంద్రానికి అందజేసింది. కచ్చితంగా ఎంతమేర లిథియం నిల్వలు ఉన్నాయనేది త్వరలోనే స్పష్టత వస్తుంది అంటున్నారు.

ఈ ఖనిజాల కోసం అన్వేషణకు అనుమతులివ్వాలని ఏపీ గనులశాఖ కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే లిథియం పరమాణు ఖనిజం కావడంతో అణు ఇంధన సంస్థ (డీఏఈ) నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలోనే లిథియం అన్వేషణకు కాస్తా ఆలస్యం అయ్యింది. వారి అనుమతితో తాజాగా ఈ రెండు జిల్లాల్లో లిథియం ఖనిజాన్ని గుర్తించారు. కొంతకాలం క్రితం నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో బంగారం ఖనిజాలను గుర్తించిన సంగతి తెలిసిందే. మరి.. తాజాగా లిథియం ఖనిజం ఏపీలో లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి